3.52 కోట్ల మొక్కలు రెడీ
సర్వం సిద్ధం
- ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి
- నేడు మెదక్‌లో ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
- 4న సిద్దిపేటకు సీఎం కేసీఆర్
- కలెక్టర్ రాహుల్ బొజ్జా వెల్లడి
సంగారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘హరితహారం’ జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇందుకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ కార్యక్రమమైనా జయప్రదమవుతుంద న్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వందలో మూడో వంతు చెట్లు వుంటాయని అన్నారు. చెట్లు విరివిగా వుంటే పర్యావరణ పరిరక్షణతో పాటు సకాలంలో వర్షాలు కురిసి ఆ దేశం సుభిక్షంగా వుంటుందన్నారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం 20 శాతం మాత్రమే పచ్చదనం వుందని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హరిత హారం కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఈనెల 4న సిద్దిపేట నియోజకవర్గంలో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ వరకు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల నుంచి 50వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. 450 నర్సరీల్లో 250 అటవీ శాఖ, 200 డోమా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రైతులు పొలాల్లో టేకు, యూకలిప్టస్ మొక్కలు, రహదారుల వెంట పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పండ్ల మొక్కలను ఎంపిక చేశామన్నారు.
జిల్లాలో దాదాపు 4.70లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు వున్నారని, ప్రతి ఇంటికి 5 నుంచి 10 మునగ, కరివేపాకు, మామిడి, సపోటా, అంజూర పండ్ల మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటేందుకు కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. గృహాల్లో స్థలం లేని వారికి క్రీపర్లను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కింద ఇప్పటివరకు 900 చెరువులను పునరుద్ధరించామని, వాటి కి చుట్టూ ఈత, ఖర్జూర మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. జిల్లాలోని పారశ్రామిక వాడల్లో పది లక్షల మొక్కలు నాటేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని, లక్ష ట్రీగార్డులను సమకూరుస్తున్నారని చెప్పారు.
జిల్లాలో రిజర్వు ఫారెస్ట్ కేవలం పది శాతం వున్నందున రూట్‌స్టాక్ ఉన్న మొక్కలన్నింటినీ పురుద్ధరిస్తామని అన్నారు. పదివేల ఎకరాల్లో పెద్ద ఎత్తున ట్రెంచ్ కటింగ్ కూడా చేస్తున్నామన్నారు. ఫారెస్ట్ చుట్టూ రక్షణగా గచ్చకాయ మొక్కలను పెంచేందుకు ఇప్పటికే రెండు లక్షల మొక్కలను కూడా అందుబాటులో వుంచామని చెప్పారు. అనంతరం స్వచ్ఛ హరిత మెదక్ పేరిట రూపొందించిన లోగోను కలెక్టర్, జేసీ తదితరులు ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ వెంకట్‌రాంరెడ్డి, డీఆర్‌ఓ దయానంద్, డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, జేడ్పీ సిఇఓ/డోమా పీడీ మధు, వాటర్ గ్రిడ్ ఎస్.ఇ.విజయప్రకాష్ పాల్గొన్నారు.
వారానికి సరిపడా గుంతలు..
మొక్కలు నాటేందుకు తొమ్మిది లక్షల గుంతలను కూడా సిద్ధం చేశామని చెప్పారు. వారం రోజులతో పాటు సెప్టెంబర్ వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతున్న దృష్ట్యా గుంతలను తవ్వించి సిద్ధం చేస్తామని వివరించారు. బహిరంగ మల విసర్జన లేని స్వచ్ఛమైన జిల్లాగా మార్చడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. లక్ష మరుగుదొడ్లు నిర్మించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినట్లు తెలిపారు.