3 ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా | 3 of crop insurance to private companies | Sakshi
Sakshi News home page

3 ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా

Published Fri, May 27 2016 2:10 AM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

3 ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా

3 ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా

బజాజ్ అలియాంజ్, రిలయన్స్ జీఐసీ, ఎస్‌బీఐ జీఐసీలకు అప్పగింత
{పభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీకి కూడా అనుమతి
పీఎంఎఫ్‌బీవై అమలు ఖరారు... వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ
3 జిల్లాల్లో వరికి 1.5% ప్రీమియం, ఒక జిల్లాలో వరికి 1.3% ప్రీమియం
వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రైవేటు కంపెనీలకే అప్పగింత

 

హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా (డబ్ల్యుబీసీఐఎస్) పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు 3 ప్రైవేటు కంపెనీలకు అనుమతించారు. పీఎంఎఫ్‌బీవైను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) సహా బజాజ్ అలియాంజ్ జీఏసీ లిమిటెడ్ ద్వారా అమలు చేస్తారు. డబ్ల్యుబీసీఐఎస్ పథకాన్ని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎస్‌బీఐ జీఐసీ లిమిటెడ్‌ల ద్వారా అమలు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలిసారిగా వ్యవసాయ బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పీఎంఎఫ్‌బీవై సహా ఇప్పటికే ఉన్న డబ్ల్యుబీసీఐఎస్ పథకాల అమలుకు ఇటీవల ప్రైవేటు బీమా కంపెనీల నుంచి టెండర్లకు ఆహ్వానించింది. 10 ప్రైవేటు బీమా కంపెనీలు బిడ్‌లు దాఖలు చేశాయి. బిడ్లను ఖరారు చేసి సర్కారుకు పంపించారు. రాష్ట్రంలో వ్యవసాయ బీమాను అమలుచేసేందుకు అనుమతి పొందిన ఈ కంపెనీలు వచ్చే ఖరీఫ్‌లో రుణం తీసుకునే రైతులతోపాటు రుణం తీసుకోని రైతులకూ సేవలందించాలి. ఆ ప్రకారం నిర్ణీత మొత్తంలో ప్రీమియం వసూలు చేయాలి.

 
పీఎంఎఫ్‌బీవై అమలుకు 3 క్లసర్ల ఏర్పాటు

పీఎంఎఫ్‌బీవై అమలుకోసం రాష్ట్రంలో 3 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదటి క్లస్టర్‌లోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా మూడో క్లస్టర్‌లో ఉన్న ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పథకాన్ని వ్యవసాయ బీమా కంపెనీ అమలు చేయనుంది. రెండో క్లస్టర్‌లో ఉన్న వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బజాజ్ అలియాంజ్ అమలు చేయనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రైతులు వరి పంటకు బీమా మొత్తంలో 1.5 % ప్రీమియంగా చెల్లించాలి. రంగారెడ్డి జిల్లా రైతులు వరికి 1.3% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. వరంగల్ జిల్లాలోని రైతులు జొన్నకు ప్రీమియం 1% చెల్లించాలి. కరీంనగర్ జిల్లా రైతులు పసుపుకు 1.8%, మహబూబ్‌నగర్ జిల్లా రైతులు మిరప (సాగు ఏరియా)కు 4 % ప్రీమియంగా చెల్లించాలని ఉత్తర్వుల్లో వివరించారు. నిర్ణీత జిల్లాల్లో నోటిఫైడ్ పంటలకు రుణాలు తీసుకునే రైతులు తప్పక పీఎంఎఫ్‌బీవై పథకానికి ప్రీమియం చెల్లించాలి. 

 
పత్తి, మిరప, పామాయిల్, బత్తాయిలకు 5 శాతం ప్రీమియం...

డబ్ల్యుబీసీఐఎస్ పథకాన్ని కూడా 3 క్లస్టర్ల వారీగా అమలుచేస్తారు. మొదటి క్లస్టర్‌లోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ దీన్ని అమలుచేస్తుంది. క్లస్టర్ రెండులోని వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు, మూడో క్లస్టర్‌లోని ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎస్‌బీఐ జీఐసీ లిమిటెడ్ కంపెనీ బీమా పథకాన్ని అమలు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పత్తికి అన్ని జిల్లాల్లోనూ బీమా వర్తింపజేస్తారు. మిరపకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో బీమా వసతి కల్పించారు. పామాయిల్‌కు ఖమ్మం జిల్లాలో, బత్తాయికి నల్లగొండ జిల్లాలో బీమా వసతి కల్పించారు. వీటన్నింటికీ బీమా మొత్తంలో 5% ప్రీమియంగా ఖరారు చేశారు. ఆ మేరకు రైతులు చెల్లించాలి. ఈ పథకాన్నీ రుణం తీసుకునే రైతులకు తప్పనిసరి చేయగా... రుణం తీసుకోని రైతులకు వారిష్టానికే వదిలేశారు. మిరపకు జూలై 9వ తేదీ, పత్తికి జూన్ 14, పామాయిల్‌కు జూలై 14, బత్తాయికి ఆగస్టు 9 ప్రీమి యం చెల్లింపుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Advertisement
Advertisement