మహబూబ్ నగర్ జిల్లా గద్వాల మండలం దయ్యాలవాగులో కారు బోల్తా పడింది.
గద్వాల్ (మహబూబ్‌నగర్ జిల్లా) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ వలయాన్ని ఢీ కొనడంతో ముగ్గురు ఎస్సైలు గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ మండలం అనంతపురం గ్రామం సమీపంలోని దెయ్యాలవాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల్ టౌన్ ఎస్సై సైదాబాయి, మల్డకల్ ఎస్సై శ్రీనివాసులు, అయిజ ఎస్సై వెంకటేశ్వర్లు ఒక కేసు నిమిత్తం కారులో కర్నూలు వెళ్లి వస్తున్నారు.
కాగా మార్గ మధ్యంలో వర్షం వస్తుండటంతో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి దెయ్యాల వాగు వద్ద ఉన్న రక్షణ గోడకు ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు ఎస్సైలు గాయపడ్డారు. వీరిలో మల్డకల్ ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.