తొలితరం ఉద్యమకారునికి 5 లక్షల సాయం | 5 lakh to the aid of the earliest activists | Sakshi
Sakshi News home page

తొలితరం ఉద్యమకారునికి 5 లక్షల సాయం

Published Thu, May 28 2015 2:26 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

తొలితరం ఉద్యమకారునికి 5 లక్షల సాయం - Sakshi

తొలితరం ఉద్యమకారునికి 5 లక్షల సాయం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోలీసుల తూటాలకు గురై అంగవైకల్యంతో దుర్భరజీవితం గడుపుతున్న తొలితరం తెలంగాణ ఉద్యమకారునికి రూ. 5 లక్షల ఆర్థికసాయం  సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈమేరకు ఆయన ఇటీవల తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నామాలగుండు పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రూ.5 లక్షల మంజూరు పత్రా న్ని అబ్కారీ మంత్రి తీగుళ్ల పద్మారావు తెలంగాణ ఉద్యమకారుడు బాలకుమార్‌కు అందించారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం లో సికింద్రాబాద్‌కు చెందిన కె.బాలకుమార్ చురుగ్గా పాల్గొన్నారు. సికింద్రాబాద్  కింగ్స్‌వే ప్రాంతంలో ఉద్యమకారులపై  పోలీసుల జరిపిన కాల్పుల్లో బాలకుమార్ కాలులోంచి తూటా దూసుకెళ్లింది.

అనంతరం గాయపడిన కాలును వైద్యులు తొలగించడంతో బాలకుమార్ అంగవైకల్యానికి గురయ్యారు. అప్పటి నుంచి పలుమార్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకున్నా పట్టించుకోలేదు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీన మెట్టుగూడకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను బాలకుమార్ కలిసి తన గోడును విన్నవించుకున్నాడు.  చలించిన కేసీఆర్ ఆర్థికసాయం అందిస్తానని మాట ఇచ్చారు. రూ. 5 లక్షల అర్థికసాయం మంజూరు చేశారు.  తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైన ఉద్యమకారుల కుటుంబాలకు, గాయపడిన వారిని గుర్తించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మంత్రి పద్మారావు అన్నారు.  ఆర్థికసాయం అందించిన సీఎం కేసీఆర్, మంత్రి పద్మారావులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement