గేట్లెత్తిన గ్రేటర్‌.. ఫస్ట్‌ డే.. ఫెస్ట్‌ | 50 Crore Alcohol One Day Sales in Hyderabad | Sakshi
Sakshi News home page

కిక్‌ స్టార్ట్‌

Published Thu, May 7 2020 7:09 AM | Last Updated on Thu, May 7 2020 9:26 AM

50 Crore Alcohol One Day Sales in Hyderabad - Sakshi

బాలానగర్‌లో ఇలా ఓ వృద్ధుడు

సాక్షి, సిటీబ్యూరో:  మద్యంప్రియుల నలభై ఐదు రోజుల ఎదురుచూపులు ఫలించాయి. మహానగరంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మహానగరంలోని మద్యం దుకాణాల వద్ద బుధవారం మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది మద్యం ప్రియులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. కట్టుదిట్టమైన పోలీసు పహారా, బారికేడ్ల ఏర్పాటు మధ్య కొన్నిచోట్ల మాస్కులు, హెల్మెట్లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ మరీ మద్యం కొనుగోలు కోసం నిరీక్షించారు. మరికొన్ని చోట్ల మాస్కులు, భౌతిక దూరం పాటించకుండానే కిక్కు కోసం పడిగాపులు పడ్డారు.

మహిళల కోసం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయడం గమనార్హం. మొత్తంగా మహానగరం పరిధిలోని సుమారు 300 మద్యం దుకాణాల వద్ద ఒక్కరోజు కిక్కు సేల్స్‌ రూ.50 కోట్లకు పైమాటేనని ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తుండటం విశేషం. సాధారణ రోజుల్లో నగరంలో సుమారు రూ.20 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయి. దసరా, సంక్రాంతి ఇతర పర్వదినాల్లో దీనికి రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరగడం పరిపాటి. కానీ దీనికి అదనంగా రికార్డు స్థాయిలో సేల్స్‌ జరగడం గమనార్హం. ఒక్కో మందుబాబు.. ఆరు బీర్లు.. మూడు ఫుల్‌ బాటిళ్లు అన్నచందంగా మద్యం కొనుగోలు చేశారు. రాజధాని రెడ్‌ జోన్‌లో ఉన్నప్పటికీ మందుబాబులజోష్‌.. ఛీర్స్‌ జోన్‌లను తలపించింది.(తెలంగాణలో మద్యం జాతర)

అందినకాడికి దండుకున్న వ్యాపారులు..

మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకొని పలుచోట్ల మద్యం వ్యాపారులు అందినకాడికి దండుకున్నారు. ప్రీమియం బ్రాండ్లపై 16 శాతం.. సాధారణ మద్యంపై 11 శాతం పెరుగుదలను సాకుగా చూపుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేశారు. ప్రీమియం బ్రాండ్లకు చెందిన ఫుల్‌ బాటిల్‌పై రూ.200 నుంచి రూ.300.. సాధారణ మద్యంపై రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేయడం గమనార్హం. పలు దుకాణాల వద్ద సవరించిన మద్యం ధరల బోర్డులను ప్రదర్శించకపోవడంతో మందుబాబులు చేసేది లేక వ్యాపారులు డిమాండ్‌ చేసిన మొత్తాన్ని చెల్లించి జేబులు గుల్లచేసుకున్నారు.   (కేసీఆర్‌ చిత్రపటానికి మందుబాబుల పాలాభిషేకం)

పలు హై ఎండ్‌ బ్రాండ్ల కొరత..
మద్యం దుకాణాల్లో పలు హై ఎండ్‌ బ్రాండ్లకు చెందిన మద్యం కొరత స్పష్టంగా కనిపించింది. పలు మద్యం దుకాణాల్లో జానీవాకర్‌ రెడ్‌లేబుల్, బ్లాక్‌ లేబుల్, డబుల్‌ బ్లాక్, చివాస్‌ రీగల్, టీచర్స్‌ 50, టీచర్స్‌ ఆరిజిన్‌ వంటి హై ఎండ్‌ మద్యం దొరకలేదని మందుబాబులు వాపోయారు. మరో రెండురోజుల్లో డిపోల నుంచి సరుకు వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. నగరంలోని మద్యం దుకాణాలకు లిక్కర్‌ సరఫరా చేసే డిపోల్లో నెలరోజులకు సరిపడా స్టాకు నిల్వ ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.  

సాక్షి, నెట్‌వర్క్‌: నగరంలో వైన్స్‌కు ‘లాక్‌’ తెరిచారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విక్రయాలు కొనసాగుతాయని ప్రకటించారు. సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ.. మాస్కులు తప్పని సరి అన్నారు. కానీ ఆ నిబంధనలను చాలామంది పట్టించుకోలేదు. ఉదయం 7 గంటల నుంచే వైన్‌ షాపుల వద్ద బారులు తీరారు. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా ఎగబడ్డారు. మరికొందరు అక్కడ.. ఇక్కడ అంటూ మందు కోసం ఊరంతా తిరిగారు. కొన్నిచోట్ల మహిళలు వైన్స్‌ షాపుల వద్ద కనిపించారు. మహిళల కోసం ప్రత్యేక క్యూ ఉండటంతో ఇళ్లలో పనిచేసే మహిళలను కొంతమంది బడాబాబులు కార్లో తీసుకొచ్చి వారితో మద్యం కొనుగోలు చేయించారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు మద్యం ప్రియులను అదుపు చేసేందుకు సాయంత్రం వరకు కష్టపడ్డారు. మద్యం షాపులు తెరవడంతో నగరంలో లాక్‌డౌన్‌ ఉందా.. అనే సందేహం కలిగింది.

భార్యతో గొడవపడి.. బ్లేడుతో కోసుకొని..

బాలానగర్‌: బాలానగర్‌లోని పార్దీ బస్తీ(పిట్టల బస్తీ)కి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి భార్యతో గొడవపడి కోపంతో బ్లేడుతో తన శరీరంపై గాట్లు పెట్టుకున్నాడు. 

మద్యం అంతా నేలపాలు..
లంగర్‌హౌస్‌: లంగర్‌హౌస్‌లోని ఓ వైన్‌ షాపులో స్టాక్‌ లేదని.. బస్టాప్‌ వద్ద ఉన్న వైన్‌షాపు వద్ద దాదాపు గంటన్నర పాటు ఓ యువకుడు క్యూలో ఉండి బీర్లు, విస్కీ బాటిళ్లు కొనుగోలు చేసి ఆనందంతో రోడ్డు దాటేందుకు వెళ్తుండగా రాయి తగిలి కిందపడ్డాడు. 9 బీరు బాటిళ్లు, 6 విస్కీ బాటిళ్లు పగిలి నేలపాలయ్యాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement