సాక్షి,సిటీబ్యూరో:గ్రేటర్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా సోమవారం మరో 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం అత్యధికంగా 122 కేసులు నమోదు కాగా, సోమవారం 79 నమోదయ్యాయి. నగరంలో చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తుండటంతో సిటిజెన్లకు కంటిమీద కునుకు కరువైంది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం నగరవాసులను కలవరపెడుతోంది.
హెచ్‌ఎఫ్‌నగర్ ఫేజ్ 1లో విద్యార్థినికి..
రహమత్‌నగర్: రహమత్‌నగర్ డివిజన్ హబీబ్‌ఫాతీమా నగర్ ఫేజ్ 1 బస్తీకి చెందిన ఇంటర్ విద్యార్థిని గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఆదివారం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు బాలిక కుటుంబ సభ్యులను ఆయుర్వేద ఆసుపత్రికి తరలించారు.
షేక్‌పేట్ డివిజన్‌లో ఇద్దరికి..
జూబ్లీహిల్స్: షేక్‌పేట్ డివిజన్‌లో మరో రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఓయూ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(32)కి కరోనా పాజిటివ్ రావడంతో అతడిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీతానగర్ కాలనీకి చెందిన కూరగాయల వ్యాపారి(42)కి పాజిటివ్ నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వెంగళరావునగర్ డివిజన్‌లో ఒకరికి..
వెంగళరావునగర్: వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్న యువకుడి(31)కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. .
ఉప్పల్ సర్కిల్‌లో యువకుడు..
ఉప్పల్: చిలుకానగర్ ప్రాంతానికి చెందిన శుభోదయ కాలని ప్రాంతానికి చెందిన యువకుడికి (32) కరోనా పాజిటివ్ వచ్చింది. కోఠిలోని ఓ వ్యాపారి వద్ద పని చేస్తున్న అతను గత కొంత కాలంగా జ్వరంతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. రామంతాపూర్ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ రిక్షా కార్మికుడి(53)కి కరోనా పాజిటీవ్ వచ్చింది.
సెలూన్ నిర్వాహకుడికి..
గౌతంనగర్: గౌతంనగర్ డివిజన్ మల్లికార్జునగర్ రోడ్ నంబర్–1లో సెలూన్ నిర్వహిస్తున్న వ్యక్తికి(48) కరోనా పాజిటివ్ రావడంతో అతడిని నేచర్ క్యూర్ ఆసుపత్రికి తరలించిన అధికారులు అతడి కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేశారు.
కాప్రా సర్కిల్‌లో మరో రెండు..
కాప్రా: కాప్రా సర్కిల్‌లో సోమవారం మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏఎస్‌రావునగర్ డివిజన్ భవానీనగర్‌లో ఒకరికి, మీర్‌పేట్–హెచ్‌బీకాలనీ డివిజన్ ఎన్‌టీఆర్ నగర్‌లో మరొకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
ముగ్గురు వృద్ధులకు..
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో సోమవారం మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాకారం వెస్లీ చర్చి ప్రాంతానికి చెందిన వృద్ధుడి(82)తో పాటు బహదూర్ ప్యార్ జంగ్ వద్ద మరో వృద్ధుడు(72), కవాడిగూడ, పద్మశాలికాలనీలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
యువ వైద్యురాలికి..
జూబ్లీహిల్స్ : యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలో నివసించే వైద్యురాలి(26)కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక్రిశాట్ కాలనీలో నివసించే ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు.
నాచారంలోని మరో ఇద్దరికి..
మల్లాపూర్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మల్లాపూర్ న్యూ నరసింహనగర్ కాలనీకి చెందిన పాన్ షాప్ నిర్వాహకుడి(40)కి, ఓల్డ్ మల్లాపూర్ మటన్ షాప్ నిర్వాహకుడికి (65) పాజిటివ్ రావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మంగళ్‌హాట్‌లో మహిళకు..
అబిడ్స్: మంగళ్‌హాట్‌లో ఓ మహిళ(55)కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇంట్లోనే ఉంటున్న ఆమె కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం, గొంతునొప్పి, జలుబుతో బాధపడుతోంది. స్థానిక ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
హిమాయత్ నగర్‌లో మరో ఇద్దరికి..
హిమాయత్ నగర్ : నారాయగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముత్యాలాబాగ్ ప్రాంతంలో ఓ కూరగాయల వ్యాపారికి పాజిటివ్ రాగా, సోమవారం ఆయన కుమార్తెకు కూడా కరోనా సోకింది. గాంధీకుటీర్ బస్తీకి చెందిన మహిళకు పాజిటివ్ వచ్చింది.
దావత్‌కు వెళ్లిన మరికొందరికి..
జియాగూడ: జియాడ, ఇందిరానగర్ నుంచి పహాడీషరీప్ దావత్‌కు వెళ్లిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఏడుగురు వ్యక్తులకు సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు (52), భీమ్‌నగర్‌లోని వృద్ధుడు (68), దుర్గానగర్‌లోని ఓ వ్యక్తి(45), కురుమ బస్తీలోని ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా కరోనా బారిన పడ్డారు.
ధూల్‌పేట్‌లో మహిళ మృతి
అబిడ్స్: ధూల్‌పేట పరిధిలో ఓ మహిళ (45) కరోనాతో మృతి చెందింది. స్థానిక శివలాల్‌నగర్‌కు చెందిన గణేష్(52) విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగించేవాడు. పది రోజుల క్రితం అతను గుండెనొప్పితో మృతిచెందాడు. కాగా అతని భార్య గత కొద్ది రోజులుగా జ్వరం, గొంతునొప్పితో బాధపడుతుండటంతో బంధువులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం మృతిచెందింది.
‘గాంధీ’లో కరోనా బాధితురాలి ప్రసవం
గాంధీఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు మరో కరోనా బాధితురాలికి డెలివరీ చేసి పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చారు. వైద్యసేవల అనంతరం తల్లిబిడ్డలు కోలుకుంటున్నారు. వైద్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ దుర్గానగర్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్ రావడంతో గతనెల 29న సరోజినీదేవి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. పురిటి నొప్పులు రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ గైనకాలజీ హెచ్‌ఓడీ మహాలక్ష్మీ నేతృత్వంలో వైద్యబృందం ఆమెకు పరీక్షలు నిర్వహించి ఉమ్మునీరు తక్కువగా ఉందని గుర్తించారు. సోమవారం సిజేరియన్ చేసి 2.5 కిలోల బరువుగల ఆడ శిశువును బయటకు తీసి ఎన్‌ఐసీయు వార్డులోని ఇంక్యూబేటర్‌లో ఉంచారు. తల్లిబిడ్డలు సురక్షితంగా ఉన్నారని, శిశువు నుంచి నమూనాలు తీసుకుని కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు ఐదుగురు కరోనా పాజిటివ్ రోగులకు ప్రసవాలు చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు.
‘కింగ్‌కోఠి’లో 19 మందికి పాజిటివ్
సుల్తాన్‌బజార్: కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో సోమవారం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. కరోనా లక్షణాలతో 177 మంది ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం వచ్చారన్నారు. వారిలో 26 మందిని అడ్మిట్ చేసుకున్నామని, 21 మంది నుంచి రక్తనమూనాలు సేకరించినట్లు తెలిపారు. గతంలో పరీక్షలు నిర్వహించిన వారిలో 19 మందికి నెగెటివ్ రావడంతో 18 మందిని డిశ్చార్జి చేసినట్లు ఆయన వివరించారు. కాగా అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సెక్యురిటీ గార్డుకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment