తుదిదశకు చేరిన సప్తతల రాజగోపురాల పనులు
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆలయానికి ఒక రూపు వచ్చింది. రాజగోపురాల పనులు పూర్తయ్యాయి.ప్రధానాలయంలో నగిషీలు చెక్కుతున్నారు. శివాలయం, భారీ కల్యాణ మండపం, విష్ణుపుష్కరిణి, వ్రత మండపం రూపుదిద్దుకుంటున్నాయి. 2020 సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎనిమిది మార్లు పర్యటించి ఆలయ పనులను పరిశీలించారు.
సాక్షి, యాదాద్రి : యాదాద్రి ఆలయం పనులు పూర్తి కావొస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న ఈ పనులను నిర్ణీత గడువు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డి యాదాద్రి పనులను పర్యవేక్షించి మరిన్ని సూచనలు చేశారు. నాణ్యత తగ్గకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి అని అయన అధికారులను ఆదేశించారు. స్పష్టమైన తేదీ చెప్పనప్పటికి వర్షాకాలం ముగిసేనాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఎనిమిది సార్లు సీఎం కేసీఆర్ పర్యటన
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవాన్ని ఆషామాషీగా కాకుండా మహోన్నతంగా నిర్వహించడానికి ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. యాదాద్రి అభివృద్ధిపై దాదాపు 135ప్రణాళికలు, 266సమీక్షలు, 8మార్లు సీఎం కేసీఆర్ పర్యటనలు, సీఎంఓ భూపాల్‌రెడ్డి 78 సమీక్షలు నిర్వహించారు. వైటీడీఏ అధికారులు, స్థపతులు, ఆర్కిటెక్చర్లు, శిల్పులు ఇలా పలు విభాగాలకు చెందిన ప్రతినిధులు ఆలయ అభివృద్ధి రూపురేఖలు తీర్చిదిద్ధే ప్రణాళికల కోసం చైనా, సింగపూర్, బెంగళూరు, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని బెంగళూరు, తంజావూరు, తిరువనంతపురం పలు ప్రాంతాలను పర్యటించారు.
వంద శాతం పూర్తయిన రాజగోపురాల పనులు
ప్రధానాలయానికి అద్భుతమైన శోభను తెచ్చిపెడుతున్న సప్తరాజగోపురాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయం అంతర్గతంగా మిగిలిపోయిన వాటిని త్వరితగతిన పూర్తి చేసే పనిలో ఉన్నారు. అంతర్గతంగా విద్యుదీకరణ, శానిటేషన్ వంటి పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం పనులు 70శాతం పూర్తి కావచ్చాయి. సత్యనారాయణ వ్రతం, కల్యాణకట్ట, ప్రసాద విక్రయశాల మండపం, పుష్కరిణి పనులు వేగంగా జరుగుతున్నాయి. మినీట్యాంక్ బండ్ పనులు జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణ పనులు 50 శాతం పనులను ఇప్పటి వరకు పూర్తి చేశారు. యాదాద్రి కొండ చుట్టూ పచ్చదనాన్ని పర్చే విధంగా గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడక్కడ భక్తులు సేదదీరడానికి పార్క్‌లు సిద్ధం చేస్తున్నారు.
చివరి దశకు పనులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నూతన ప్రధానాలయం నిర్మాణం, అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2020 బ్రహ్మోత్సవాల నాటికి పనులన్నింటినీ పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. గడువు విషయం ప్రకటించనప్పటికీ అంతర్గతంగా వి«ధించుకున్న టార్గెట్ ప్రకారం పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధానాలయం శిల్పిపనుల్లో భాగంగా రాజగోపురాలు, గర్భాలయం, గర్భాలయం లోపల ఉన్న ఆళ్వార్ల విగ్రహాలు, ఆలయ ప్రాకారాలు పూర్తయ్యాయి. గర్భాలయం గోడలపై ప్రహ్లాద చరిత్రను చెక్కుతున్నారు. గర్భాలయంలోని ధ్వజస్తంభం పనులతోపాటు ఆలయ తిరుమాడ వీధుల్లోని ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవ మండపం, శివాలయం వైపు ఈశాన్యంలో రోడ్డు పనులు చేయనున్నారు.
చకాచకా శివాలయం పనులు
ప్రధానాలయంతో పాటుగా హరిహరక్షేత్రంగా పేరుగాంచిన రామలింగేశ్వరాలయం(శివాలయం)లో యాగశాలకు వైటీడీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ యాగశాల, నవగ్రహ మండపాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. శివాలయం చుట్టూ ప్రాకారాలకు సుమారుగా 25 నంది విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలోకి ప్రవేశించే త్రితల రాజగోపురానికి ఎదురుగా ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. శివాలయంలో హైరోప్ పనులు నడుస్తున్నాయి. శివాలయం గర్భాలయంలోని ముఖ మండపంలో సుమారు 16 అందమైన స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 8 బాల పాదాలని, మరో 8 చిత్ర కంఠ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా యాగశాలకు సహజత్వం ఉట్టి పడే శోభాయమానంగా అలంకారం చేయబడిన మరో 16 కృష్ణ శిలలతో కూడిన రాతి స్తంభాలు అమరుస్తారు. ఈ ఆలయంలో నవగ్రహాలు, ఆంజనేయస్వామి మండపం ఉంటాయి. కొండపైన గల శివాలయానికి రామలింగేశ్వర స్వామి ఆలయంగా పేరున్నందున రామాలయానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వివిధ ఆకృతులు గల శిల్పాలతో నిర్మాణం జరుగుతోంది. ప్రతి సంవత్సరం జరగనున్న శ్రీరామనవమి రోజున కల్యాణానికి సుమారు 500 మంది కూర్చొని తిలకించే విధంగా బ్రహ్మోత్సవ కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు.
తుదిదశకు చేరిన సప్తతల రాజగోపురాల పనులు
Comments
Please login to add a commentAdd a comment