19 రోజులు... 88 గంటలు
- ఇవీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ పనిగంటలు
- టీఆర్‌ఎస్‌కు 40 గంటలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు 19 రోజులు జరిగాయి. ఈ 19 రోజుల్లో బడ్జెట్ పద్దులు, ‘ఆసరా’ పింఛన్లు, విద్యుత్తు కొరత, అసైన్డ్ భూముల ఆక్రమణ, హౌసింగ్ సొసైటీలు వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చలు, సావధాన తీర్మానాలపై కలిపి మొత్తం 88 గంటల 6 నిమిషాల పాటు సభ్యుల మధ్య చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. వాటికోసం అధికారపక్షమైన టీఆర్‌ఎస్ 40 గంటలపాటు సమయం తీసుకోగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు 17 గంటల 53 నిమిషాల పాటు మాట్లాడేందుకు అవకాశం దక్కింది.
తెలుగుదేశం పార్టీకి 7 గంటల 52 నిమిషాల సమయం దొరికింది. బీజేపీకి 8 గంటల 56 నిమిషాలు, ఎంఐఎంకు 7 గంటల 56 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం చిక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2 గంటల 10 నిమిషాలు, బీఎస్పీకి 7 నిమిషాలు, సీపీఐకి ఒక గంటా 17 నిమిషాలు, సీపీఎంకు 2 గంటల 11 నిమిషాలు సమయం లభించింది. అయిదుగురు సభ్యులున్న బీజేపీ , ఏడుగురు సభ్యులున్న ఎంఐఎంల కంటే పదిహేను మంది సభ్యులున్న టీడీపీకి శాసనసభ చర్చల్లో మాట్లాడటానికి తక్కువ సమయం దొరకడం గమనార్హం. ఈ సమావేశాల్లో నక్షత్రం గుర్తు, ఆ గుర్తులేని ప్రశ్నలు 173 వచ్చాయి. మూడు సావధాన తీర్మానాలపైనా చర్చ జరిగింది.
మూడు బిల్లులు.. ఆరు తీర్మానాలు
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో 3 బిల్లులు ఆమోదం పొందాయి. ఆరు తీర్మానాలను కూడా ఈ సమావేశంలో ఆమోదించారు. ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు కొత్త పారిశ్రామిక విధానం, కంటిజెన్సీ ప్లాన్ నిధుల బిల్లులు ఆమోదం పొందాయి. తీర్మానాలను ఆరింటిని ఆమోదించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు వాటాను కేంద్ర ప్రభుత్వమే ఇప్పించాలని, లేకుంటే కేంద్రమే ఆ రాష్ట్రానికిచ్చే వాటాను తెలంగాణకు మళ్లించాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభను కనబర్చిన తెలంగాణ ప్రాంత క్రీడాకారులకు అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ పేరును మార్చొద్దని, యథావిధిగా ఆ పేరును కొనసాగించాలని తీర్మానించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని కుదించకుండా మరింత విస్తరించాలని తీర్మానించారు.
కామన్వెల్తు పార్లమెంటరీ అసోసియేషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి సభ్యత్వం ఇవ్వాలని తీర్మానించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీ తీర్మానించింది. మూడు సభాసంఘాలను వేశారు. అసైన్డు భూముల అన్యాక్రాంతం, ఆక్రమణపై, వక్ఫ్ భూముల ఆక్రమణలపై, హౌసింగ్ సొసైటీల్లో అవకతవకలపై ఈ సభా సంఘాలను స్పీకరు వేశారు.