
పోలింగ్ 90 శాతానికి తగ్గొద్దు
- అర్హులైన ప్రతి ఓటరుపేరుజాబితాలో ఉండాలి
- అధికారులకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచన
- బీఎల్‌ఓలు ఇంటింటికి పోల్ చీటీలు పంచుతారు
- ఓటర్ల నమోదుకు రాజకీయ పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 2009 సాధారణ ఎన్నికల్లో 72శాతం పోలింగ్ నమోదయిందని, ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ 90 శాతానికి తగ్గకుండా చూడాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులకు సూచించారు. ఓటర్ల నమోదులో అధికారులతో పాటు రాజకీయ పక్షాలు కూడా సహకరించాలని కోరారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో విడివిడిగా సమావేశ మయ్యారు.
కలెక్టర్ జి.కిషన్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీలు వెంకటేశ్వర్‌రావు, కాళిదాసు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో భన్వర్‌లాల్ మాట్లాడుతూ పోలింగ్ విషయంలో అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. ఓటరు నమోదుకు అవకాశం ఉన్నందున వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని, అర్హులైన ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆందోళన చేసే పరిస్థితి కల్పించవద్దని చెప్పారు.
ఈవీఎంల వాడకంపై ప్రతి ఓటరుకు అవగాహన ఉండేలా ఛైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను భన్వర్‌లాల్ అభినందించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
వారం ముందు పోల్‌చీటీల పంపిణీ
ఓటరు జాబితాలో పేరు విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు పోలింగ్‌కు వారం రోజుల ముందు బీల్‌వో(బూత్ లెవల్ ఆఫీసర్)లు ఇంటిం టికి వెళ్లి చీటీలు పంచుతారని, పంపిణీ క్రమంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పార్టీల ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని భన్వర్‌లాల్ కోరారు.
ఓటరు నమోదు శాతాన్ని పెంచేందుకు రాజకీ య పార్టీలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ పార్టీలకు సంబంధించిన కండువాలు, జెండాలు ఒకసారి కొనుగోలు చేసినవే ఎన్నికలు పూర్తయ్యేవరకు ఉపయోగస్తామని, వానిటి ప్రతిచోటా లెక్కించడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని భన్వర్‌లాల్ దృష్టికి తెచ్చారు.
పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో టేబుల్, కుర్చీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశంలో కాగ్రెస్ పార్టీ నుంచి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి గుడిమల్ల రవికుమార్, టీడీపీ నుంచి ఎడబోయిన బస్వారెడ్డి, బీజేపీ నుంచి మురళీమనోహర్, సీపీఐ నుంచి టి.శ్రీనివాస్‌రావు, వీరగంటి సదానందం, బీఎస్పీ నుంచి కట్కం యాదగిరి పాల్గొన్నారు.
నిట్‌లో భన్వర్‌లాల్..
నిట్ క్యాంపస్ : జిల్లా ఎన్నికల అధికారుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం నిట్ గెస్ట్‌హౌజ్‌లో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. భన్వర్‌లాల్‌ను కలెక్టరేట్‌లో జరిగే సమావేశానికి ఆహ్వానించడానికి జిల్లా కలెక్టర్ కిషన్, వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు వచ్చారు. ఈ సందర్బంగా భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్ కిషన్‌ను సాధారణ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులతో సమావేశం కావడానికి భన్వర్‌లాల్ బయలుదేరి వెళ్లారు.