
'కేసీఆర్ ఎజెండానే నా ఎజెండా'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్కు అన్ని జిల్లాలు సమానమేనని వెల్లడించారు.
ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలు అన్న తారతమ్యాలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని పదవులు పొందిన నేతలంతా కలసి పని చేస్తామని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఎజెండానే తన ఎజెండా అని తెలిపారు. తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని లక్ష్మారెడ్డి చెప్పారు.