ఆమెకు సిటీనే సేఫ్‌! | Women's safety,cost of living in the Greater is Best | Sakshi
Sakshi News home page

ఆమెకు సిటీనే సేఫ్‌!

Published Tue, Sep 26 2017 1:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Women's safety,cost of living in the Greater is Best - Sakshi

మహిళల భద్రత విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ అత్యంత సురక్షితమైనదని తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేసే మహిళల విషయానికి వస్తే నగరంలో జీవన వ్యయం కూడా వారికి భారంగా పరిణమించడంలేదని..అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉందని నెస్ట్‌ అవే అనే రెంటల్‌ సంస్థ ఆన్‌లైన్‌ మాధ్యమంలో నిర్వహించిన తాజా సర్వేలో తేలింది.

ఈ సంస్థ ప్రధానంగా హైదరాబాద్, పుణే, బెంగళూరు, ఢిల్లీ నగరాలపై మహిళా నెటిజన్ల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో విద్య, వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో పనిచేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్‌ నగరం 4.2 పాయింట్లు సాధించి అత్యంత సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 4 పాయింట్లతో పుణే రెండోస్థానం, 3.9 పాయింట్లతో బెంగళూరు మూడోస్థానం, 3.4 పాయింట్లతో ఢిల్లీ నాలుగో స్థానం ప్రకటించింది.  – సాక్షి, హైదరాబాద్‌


హైదరాబాద్‌షా
నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, శంషాబాద్, మియాపూర్, కేపీహెచ్‌బీ, శేరిలింగంపల్లి, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇంటి అద్దెలు, హాస్టల్‌ రెంట్లు పనిచేసే మహిళలకు ఆర్థిక భారంగా పరిణమించడంలేదని వెల్లడించింది. పలు మెట్రో నగరాల్లో ఉద్యోగం చేసే ఒంటరి మహిళలు తమకు లభిస్తున్న వేతనంలో 50 శాతం వరకు నివాస వసతి, భోజనం ఇతరత్రా జీవన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు తేలింది.

ఇక వసతి విషయంలో హైదరాబాద్‌ నగరంలోని పలు హాస్టళ్లలో సుమారు రూ.6 నుంచి రూ.7 వేల వరకు లభ్యమౌతున్నాయని పేర్కొంది. పనిచేసే ప్రదేశానికి ఐదు లేదా పది కిలోమీటర్ల పరిధిలోని హాస్టళ్లు, ఇళ్లలో నివాసం ఉండేవారికి ఇతర అవసరాలకు చేసే జీవన వ్యయం కూడా అందుబాటులోనే ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు అభిప్రాయపడినట్లు ఈ సర్వే వెల్లడించింది.

ఇక నగరంలో ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాం తాల్లో ఇంటి అద్దెలు మహిళలకు అందుబాటు లో ఉన్నట్లు తేలింది. అలాగే హాస్టళ్లలో ఉండే వసతులను బట్టి పురుషుల నుంచి వసూలు చేస్తున్న అద్దెలతో పోలిస్తే మహిళలు చెల్లిస్తున్న అద్దెలు కూడా వారికి ఏమాత్రం భారంగా పరిణమించడం లేదని.. ఈ విషయంలో తాము ఎలాంటి వివక్ష ఎదుర్కోవడం లేదని పలువురు పేర్కొన్నట్లు తెలిపింది.


పొరుగు రాష్ట్రాల వారికీ భద్రమే
ఇక ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల మహిళలు కూడా గ్రేటర్‌లో స్వేచ్ఛగా, భద్రంగా జీవించేందుకు అనువైన పరిస్థితులున్నాయని విశేషం. నగరానికి ఏడాది, రెండేళ్ల క్రితం ప్రవేశించిన పలువురు మహిళలు సిటీలో తాత్కాలిక, స్థిర నివాసం, అద్దె ఇళ్లలో ఉండటం, హాస్టళ్లలో వసతి పొందే విషయంలో తమకు అంతగా ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపినట్లు ఈ సర్వే తెలిపింది.

నగరంలో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకుంటున్నవారికీ ఈ నగరంలో జీవన వ్యయాలు, పని ప్రదేశాలు అనుకూలంగానే ఉన్నట్లు తెలిపారు. పనిచేస్తున్న కార్యాలయం నుంచి ఐదు లేదా పదికిలోమీటర్ల పరిధిలో ఉండే నివాసానికి వెళ్లేందుకు క్యాబ్‌లు, బస్సులు, ఇతర ప్రజా రవాణా సాధనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement