సాక్షి, హైదరాబాద్: ఉరుకుల పరుగుల జీవితం...పని ఒత్తిడి.. నిద్రలేమి నేపథ్యంలో గ్రేటర్ సిటీజన్లకు మతిపోవడమే కాదు.. మతిమరుపు పెరుగుతోందట. మతిమరుపులో హైదరాబాద్ మహానగరం దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో నాలుగోస్థానంలో నిలిచినట్లు ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్ ‘లాస్ అండ్ ఫౌండ్’ తాజా సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా గతేడాది తమ క్యాబ్ సర్వీసుల్లో రాకపోకలు సాగించిన ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను విశ్లేషించి, ఈ సర్వే వివరాలను తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో గ్రీన్ సిటీగా పిలిచే బెంగళూరు తొలిస్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో, మూడోస్థానంలో ముంబై నిలిచాయి. ఐదు, ఆరు స్థానాల్లో కోల్‌కతా, చెన్నై.. ఆ తర్వాతి స్థానాలు పూణే, జైపూర్, చండీగఢ్, అహ్మాదాబాద్ నగరాలు దక్కించుకున్నాయి.
ప్రయాణాల్లోనే ఎక్కువగా..
భోజనం తరవాత భుక్తాయాసం, ప్రయాణంలో కునుకుపాట్ల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో..అదీ ప్రయాణం చేస్తున్న సమయంలోనే తమ వ్యక్తిగత వస్తువులను సిటీజన్లు పోగొట్టుకుంటున్నట్లు ఈ సర్వే తెలిపింది. అత్యధిక ప్రయాణీకులు సెల్‌ఫోన్లు, బ్యాగ్‌లు, ఇళ్లు, ఆఫీసు తాళాలు పోగోట్టుకుంటున్నారట. మరికొందరు ఐడీ కార్డులు, కళ్లజోళ్లు, గొడుగుల వంటి వ్యక్తిగత వినియోగ వస్తువులను మరిచిపోతున్నట్లు తెలిపింది. మరికొందరైతే ఏకంగా బంగారు ఆభరణాలు, ఎల్‌సీడీ టీవీలు, పిల్లల ఆట వస్తువుల వంటివి తాము పోగొట్టుకుంటున్నట్లు తెలిపారని ఈ సర్వే ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment