న్యూఢిల్లీ: సాధారణంగా చాలామంది ఉదయాన్నే అల్పాహారంగా ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు. త్వరగా జీర్ణమైపోవడంతో పాటు ఆరోగ్యానికి ఇడ్లీ మంచిదని ఆహార నిపుణులు చెబుతుంటారు. గోధుమ రవ్వ లేదా రాగిపిండితో చేసిన ఇడ్లీల ద్వా రా ఆరోగ్యంతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతారు. ‘ఉబెర్ ఈట్స్’ అనే సంస్థ అల్పాహారం విషయంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఉదయా న్నే అల్పాహారంగా ఇడ్లీ తీసుకునే నగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచినట్లు ఉబెర్ ఈట్స్ తెలిపింది. ఈ జాబితాలో ఉత్తరాది నగరం ముంబై రెండోస్థానంలో, చెన్నై మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఉదయం 7.30–11.30 కాలంలో గణనీయమైన సంఖ్యలో ఆర్డర్లు వచ్చినట్లు చెప్పింది. మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం నేపథ్యంలో ఈ వివరాలను ‘ఉబెర్ ఈట్స్’ విడుదల చేసింది. ఈ నెల 10న దేశమంతటా అత్యధిక సంఖ్యలో ఇడ్లీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.
వెరైటీ ఇడ్లీలపై మక్కువ
ఇడ్లీలపై కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ మక్కువ ఎక్కువేనని సర్వే తేల్చింది. భారత్ వెలుపల అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూజెర్సీ, బ్రిటన్‌లోని లండన్ వాసులు ఇడ్లీలను లాగించేస్తున్నారని ఉబెర్ ఈట్స్ వెల్లడించింది. ఇక ఇడ్లీ వెరైటీల విషయంలోనూ భారతీయులు వెనక్కి తగ్గట్లేదని ఈ సందర్భంగా తేలింది. తమిళనాడులోని కోయంబత్తూరు వాసులు చికెన్‌ఫ్రై ఇడ్లీపై మనసు పారేసుకున్నట్లు సర్వే పేర్కొంది. తిరుచినాపల్లి వాసులు ఇడ్లీ మంచూరియాను, నాగ్‌పూర్ నగర వాసులు చాకోలెట్ ఇడ్లీపై మనసు పారేసుకున్నారని సర్వే వెల్లడించింది.
అలాగే ఆర్డర్ల సందర్భంగా కొంచెం చట్నీ, కారంపొడి, సాంబార్ ఎక్కువగా వేయాల్సిందిగా చాలామంది వినియోగదారులు కోరారంది. అలాగే ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉన్న మరికొందరు వినియోగదారులు వెజిటబుల్ ఇడ్లీని ఆర్డర్ చేశారని పేర్కొంది. ‘ఇడ్లీ ప్రియులు అత్యధికంగా ఉన్న నగరంగా బెంగళూరు అవతరించడం నిజంగా సంతోషకరమైన విషయం. భారత్‌లో అత్యధికులు ఇడ్లీని తమ అల్పాహారంగా తీసుకుంటారు. అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవాన్ని గత మూడేళ్లుగా జరుపుతున్నారు. తమిళనాడు కేటరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజమణి అయ్యర్ తొలుత ఈ ప్రతిపాదన చేశారు’ అని బెంగళూరుకు చెందిన ‘బ్రాహ్మిణ్స్ థట్టె ఇడ్లీ’ యజమాని సుభాష్ శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment