పంట నష్టంపై ఉన్నతస్థాయి బృందం
కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌కు ఎంపీ పొంగులేటి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: అకాల వర్షాలు, వడగండ్లతో తెలంగాణలో అపారపంట నష్టం వాటిల్లిందని, బాధిత రైతులను ఆదుకోడానికి కేంద్రం సత్వరమే సహా యం చేయాలని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. నష్టం అంచనావేయడానికి ఉన్నతస్థాయి బృందాన్ని తెలంగాణకు పంపాలని కోరారు. సోమవారం ఆయన కేంద్రమంత్రిని కలిసి తెలంగాణలోని అకాలవర్షాల పరిస్థితులు, పంటనష్టం వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. తెలంగాణ వ్యవసాయ విభాగం ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్రంలో కనీసం 35,175 హెక్టార్ల ఉద్యానవన పంటలు, 40,131 హెక్టార్ల వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం కలిగిందని మంత్రికి వివరించారు.
నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 30 వేల హెక్టార్ల పంట దెబ్బతిందన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.100 కోట్లు నష్టం జరిగినట్టు మంత్రికి వివరించారు. అకాల వర్షాల ప్రభావం పౌ ల్ట్రీ రైతులపై కూడా పడిందన్నారు. భారీ వర్షాలకు జగిత్యాలతో 50వేల కోళ్లు మృత్యువాతపడ్డాయన్నారు. రైతులు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ధాన్యం, ఇతర పంటల దిగుబడి లేక ఆహార సంక్షోభంతో రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.