చండ్రుగొండ/ ఖమ్మం మామిళ్లగూడెం: త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ వేడుక. అలనాడు ఇబ్రహీం అలైసలాం తన కుమారున్ని దైవమార్గంలో బలి ఇచ్చేందుకు ఉపక్రమించటం ఆయన త్యాగానికి పరాకాష్ట. ఆ త్యాగాన్ని మననం చేసుకోవడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం. దైవం ఒకరిని నాయకుడిని చేయడానికి అతని వంశం, పలుకుబడి, బాహ్యా ఆకారం ఇలాంటివేవి చూడడు.
అతని గుణగణాలు, సచ్చీలత, మంచితనం ఎలాంటివో అన్న విషయాలే ఆయనకు ముఖ్యం. ఎవరు దైవానికి భయపడతారో వారే దైవం దృష్టిలో ఉత్తములు. అతడినే దైవం నాయకుడిగా ఎన్నుకుంటాడు. నేటికి ప్రపంచంలోని నాయకులకు కనువిప్పులాంటిది ఇబ్రహీం అలైసలాం నాయకత్వ చరిత్ర. ఆయన జీవితం ఆద్యంతం త్యాగాలమయం. అందుకే ఆయనను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనూ విశ్వాసులకు తండ్రి అని కొనియాడారు.
ఇబ్రహీం ఒక ఆదర్శమూర్తి అని దివ్యఖురాన్ పేర్కొంది. ఇబ్రహీం అలైసలాం 99 సంవత్సరాల వయస్సులో ఉండగా చేతికొచ్చిన అతని ఏకైక కుమారుడు (ఇస్మాయిల్ అలైసలాం) దైవం తనమార్గంలో (బలి) అర్పించమని కోరింది. దైవం ఆజ్ఞను శిరసావహించిన ఇబ్రహీం తన కుమారుడి సమ్మతం పొందారు. తన ఏకైక కుమారున్ని బలి ఇచ్చేందుకు ఉపక్రమించారు. మరోమారు దైవాజ్ఞానుసారం ఇస్మాయిల్ స్థానంలో ఒక పొట్టేలును బలి ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా నాడు జరిగిన చారిత్రకఘట్టం. ఆ బృహత్తర త్యాగాన్ని మననం చేసుకునేదే బక్రీద్.
ఇది అనాగరిక చర్య..కానేకాదు..
బలిదానం.. ఇదొక అనారిక చర్యనా..? కానేకాదు. వాస్తవంగా మనుషులను దైవం బలితీసుకోవడం అవసరమా..? ఇబ్రహీంకు జరిగిన సంఘటనతో ఈ సందేహం తలెత్తుతుంది. దైవం తన పట్ల ఇబ్రహీంకు ఉన్న అపారమైన ప్రేమను లోకానికి తెలిపేందుకు ఈ పరీక్ష పెట్టినట్లు గ్రంథాలు చెబుతున్నాయి.
ప్రాణంకంటే మిన్నగా భావించిన తన కుమారున్ని దైవమార్గంలో బలిదానం చేసేందుకు ఇబ్రహీం ముందుకు రావటం ప్రతి ఒక దైవ విశ్వాసికి ఆదర్శం. ఆ స్థాయిలో మనం త్యాగాలు చేయకున్నా దైవ ప్రేమను పొందేందుకు కనీసం చెడుమార్గాలకు దూరంగా ఉంటే చాలు. ప్రతి చెడుపనికి దూరంగా ఉంటూ సన్మార్గం వైపు అడుగులు వేయించడమే మన కర్తవ్యం. అలా కాకుండా బక్రీద్ వేడుకను మొక్కుబడిగా చేసుకుంటూ పోతే ఎన్ని గొర్రెపోతులను బలిచ్చి నా వృథాయేనని మత పెద్దలు అంటున్నారు.
ఖమ్మంలో ముస్తాబైన ఈద్గాలు..
బక్రీద్ సందర్భంగా నమాజ్ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈద్గాలు ముస్తాబయ్యాయి. ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలోని ఈద్గా, అర్బన్ మండలం గొల్లగూడెంలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలోని మోమినాన్ ప్రాంతం లో ఉదయం 8 గంటలకు ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తామని మజీద్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్‌హకీం, ఉపాధ్యక్షులు రషీద్, కార్యదర్శి షరీఫ్ పేర్కొన్నారు.
త్యాగానికి ప్రతీక బక్రీద్
Published Mon, Oct 6 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement