– ఐటీ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి...చేయి తిరిగిన చెఫ్‌గా...
తన తండ్రి చిన్నప్పటి నుంచీ బజ్జీలు వగైరా తయారు చేసి బండి మీద విక్రయించేవాడని ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికైనా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించడమే తన లక్ష్యమని మాస్టర్ చెఫ్ భాషా అంటున్నారు. ఇటీవల సోనీలివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు మాస్టర్ చెఫ్ పోటీలలో ఈ అనంతపురం నివాసి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ... తన అభిప్రాయాలను పంచుకున్నారు..
నాన్న ‘వంటబట్టించిన’కళ...
మాది అనంతపురంలోని పుటపర్తి దగ్గర గోరంట్ల మా నాన్నకు ముగ్గురు పిల్లలం. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే స్వీట్లు, కారపు సరుకులు వగైరా తినుబండారాలను తయారు చేసి వాటిని బండి మీద తీసుకెళ్లి విక్రయించేవాడు.. ఆ బండి నడుపుతూనే ఆయన మా సంసారమనే బండిని కూడా విజయవంతంగా నడిపారు. పిల్లలు అందర్నీ బాగా చదివించారు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగుళూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాను.
కానీ...నాకు నేనుగా ఏదైనా సృజనాత్మక రంగంలో రాణించాలనే తపన, చిన్నప్పటి నుంచీ ఇంట్లో వంటల తయారీ వల్ల వంటబట్టిన పాకశాస్త్ర కళ నన్ను నాలుగైదు నెలలకు మించి ఉద్యోగంలో ఉంచలేదు. దాంతో ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకున్నా ఉద్యోగాన్ని వదిలేసి గరిట చేతబట్టాను.
కంప్యూటర్ సైన్స్ టూ కిచెన్ సెన్స్...
అలా కంప్యూటర్ సైన్స్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి కిచెన్ లో వంటలకు వెల్‌కమ్ చెప్పాను. చెన్నైలో నివసించే ప్రముఖ మహిళా చెఫ్ దగ్గర బేకరీ ఐటమ్స్‌లో శిక్షణ పొందాను. ఆమె సారధ్యంలో వైవిధ్యభరితమైన బేకరీ ఉత్పత్తుల తయారీని తెలుసుకున్నాను. ప్రస్తుతం రెస్టారెంట్స్‌కి మెనూ రూపొందించే సేవలు అందిస్తున్నాను. మరిన్ని వెరైటీ వంటల్లో రాణించాలని సాధన చేస్తున్నాను. అదే క్రమంలో తొలిసారి తెలుగులో సోనీ లివ్ వారు నిర్వహించిన మాస్టర్ చెఫ్ పోటీలకు దరఖాస్తు చేయడం అందులో పాల్గొని టైటిల్ గెలుపొందడం జరిగింది.
టైటిల్ పోటీలో నేను రూపొందించిన గ్రేట్ ఫుల్ పిస్తాషో పేస్ట్రీలో ఒక్కో లేయర్‌ను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు అంకితమిస్తూ చేయడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఈ టైటిల్ స్ఫూర్తితో పేరొందిన చెఫ్‌గా రాణించడం, నాన్న ప్రస్తుతం గోరంట్ల బస్‌స్టాండ్ దగ్గర నడుపుతున్న చికెన్ కబాబ్స్ బండిని పూర్తి స్థాయి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌గా మార్చడం... ఇవే నా భవిష్యత్తు లక్ష్యాలు.
ఫాదర్స్ డే స్పెషల్ కథనం
Comments
Please login to add a commentAdd a comment