‘నోటు’కాడి కూడూ రద్దు | A Tragedy with demonetisation | Sakshi
Sakshi News home page

‘నోటు’కాడి కూడూ రద్దు

Published Wed, Dec 14 2016 3:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

‘నోటు’కాడి కూడూ రద్దు

‘నోటు’కాడి కూడూ రద్దు

- పెద్ద నోట్ల రద్దుతో ‘అమ్మానాన్న’ ఆశ్రమంలో అభాగ్యుల విలవిల
- అర్ధాకలితో అల్లాడుతున్న 388 మంది అనాథలు
- డబ్బుల్లేక ముందుకు రాని దాతలు
- మూడు పూటల భోజనం రెండు పూటలకు కుదింపు
- పరిస్థితి ఇలాగే ఉంటే ఇక ఒక్కపూటే..


చౌటుప్పల్‌: వారంతా విధి వంచితులు.. అనాథలు.. అభాగ్యులు.. ఓ అనాథ ఆశ్రమంలో కాలం గడు పుతున్నారు.. దాతల సాయంతో ఆ ఆశ్రమం ఇన్నాళ్లూ బాగానే నడిచింది.. కానీ ఇప్పుడు నోట్ల రద్దు ప్రభావంతో ఆశ్రమ నిర్వహణ భారంగా మారింది.. దాతల సాయం తగ్గిపోయింది.. ఇన్నాళ్లూ కడుపునిండా అన్నం తిన్న ఆ అనాథలు ఇప్పుడు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇంకొందరు మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు!

అన్నమో రామచంద్రా..: వీధుల్లో తిరిగే అనాథలు, అభాగ్యులను చేరదీసి మానవతా దృక్పథంతో సేవలందించాలనే లక్ష్యంతో నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గట్టుశంకర్‌ అనే వ్యక్తి చౌటుప్పల్‌లో ‘అమ్మానాన్న’ పేరిట అనాథాశ్రమాన్ని నెలకొల్పాడు. 2010 ఫిబ్రవరి 1న ఇద్దరు అనాథలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 388 మంది ఉన్నారు. వీరిలో 320 మంది పురుషులు, 68 మంది మహిళలు. వలిగొండ రోడ్డు సమీపంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఈ ఆశ్రమం నడుస్తోంది. వీరికి రోజుకు మూడు పూటలా భోజనం, ఇతర సౌకర్యాలు అందిస్తారు. వారికి వ్యక్తిగత సపర్యలు చేసేందుకు 14 మంది సభ్యులు స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా నెల రోజుల నుంచి ఆశ్రమ నిర్వాహణ పూర్తిగా తలకిందులైంది. పెద్ద నోట్లను రద్దు తర్వాత నిధులకు కొరత ఏర్పడింది. దాతలు ముందుకు రాకపోవడంతో మూడు పూటలా భోజనం కాస్తా రెండు పూటలకు కుదించాల్సి వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఒక్కపూట భోజనం కూడా కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వారికి దుస్తులు, దుప్పట్లు కూడా సరిపడా లేవు.

కొత్తగా మరో 200 మంది..: అమ్మానాన్న ఆశ్రమం ఇటీవల జీహెచ్‌ఎంసీతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఉన్న అనాథలు, మతిస్థిమితం లేని వ్యక్తులు, అడుక్కుతినే వారిని ఈ ఆశ్రమంలో చేర్చుకునేందుకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో ఒప్పందం చేసుకున్నారు. బెగ్గర్‌ఫ్రీ సిటీలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. ఆ క్రమంలో ఇటీవలే 200 మందిని హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారు. అసలే నోట్ల రద్దు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ఆశ్రమానికి మరో 200 మంది వరకు అదనంగా రావడంతో నిర్వహణ మరింత భారంగా మారింది.

పూటకు రూ.8 వేల ఖర్చు: ఆశ్రమంలోని అనాథల భోజనానికి ఒక్క పూటకు రూ.8వేల ఖర్చు వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా మూడు పూటలకు రూ.24 వేల ఖర్చు వస్తుంది. గతంలో ప్రతినెలా 25 మంది దాతలు అన్నదానం నిర్వహించేవారు. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు ఐదుగురు మాత్రమే అన్నదానం చేశారు. దాతలు లేకపోవడంతో నిర్వహణ భారం ఆశ్రమ నిర్వాహకులపైనే పడుతోంది. దీంతో నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఆగిపోయిన అన్నపూర్ణ..: ఆశ్రమంలోని 237 మందికి అన్నపూర్ణ పథకం కింద ఒక్కరికి పది కిలోల చొప్పున బియ్యం వచ్చేవి. కానీ రెండు నెలలుగా అవి కూడా రావడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాగా ఉన్నప్పుడు సక్రమంగా అందిన బియ్యం.. విభజన జరగడంతో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ప్రస్తుతం బియ్యం సరఫరా జరగాలంటే ఆశ్రమంలోని అనాథలందరికీ ఆధార్‌ కార్డులు ఉండాలి. ఈ ప్రక్రియ పూర్తయితే గానీ బియ్యం సరఫరా జరిగే అవకాశాలు లేవు. నిబంధనలు కాకుండా సేవాదృక్పథంతో బియ్యం సరఫరాను పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి
బెగ్గర్‌ఫ్రీ సిటీలో భాగంగా హైదరాబాద్‌ నుంచి అనాథలు, మతిస్థితిమితం కోల్పోయిన వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చాం. జీహెచ్‌సీం వాళ్లు తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఆశ్రమంలో భోజనం పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. లేకుంటే అనాథలు అన్నమో రామచంద్రా అంటూ రోడ్లెక్కే పరిస్థితి నెలకొంటుంది.
– గట్టు శంకర్, ఆశ్రమ నిర్వాహకుడు

మహిళల సిగపట్లు
మూడు రోజుల సెలవుల తర్వాత తెరుచుకున్న బ్యాంకుల వద్ద ఆందోళనకర పరిస్థితులు మొదలయ్యాయి. మంగళవారం వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లోని స్టేట్‌ బ్యాంకుకు జనం భారీగా వచ్చారు. దీంతో ఖాతాదారుల మధ్య తోపులాట జరిగింది. మహిళల మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి కొట్టుకునేదాకా వచ్చింది.

నాన్నకు వైద్యం ఎలా..?
‘‘నెల రోజుల కింద మా నాన్న బస్వరాజ్‌ అనారోగ్యానికి గుర య్యారు. హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాం. పరీక్షలు చేసి న వైద్యులు గుండెజబ్బు అని చెప్పారు. ఆస్ప త్రి ఖర్చుల కోసం ఆ డబ్బు తీసుకునేందుకు బ్యాంకు దగ్గరికి వచ్చిన. ‘నో క్యాష్‌’ బోర్డు పెట్టారు. నాన్నకు వైద్యం ఎలా చేయించాలి.
– ప్రవీణ్, పాత కోల్కుంద,  వికారాబాద్‌ జిల్లా

బ్యాంకు వద్ద తొక్కిసలాట
మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌లోని బ్యాంకుల వద్ద జనం పెద్ద సంఖ్యలో బారులుదీరారు. స్థానిక ఎస్‌బీహెచ్‌ వద్ద తీవ్ర తోపులాట జరిగి, ప్రధాన గేటు విరిగిపోయింది. మహిళలకు మొదటి అంతస్తులో చెల్లించడంతో వారు ఇరుకైన మెట్ల మీద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఓ దశలో తోపులాట, తొక్కిసలాట జరిగి బాబాపూర్‌కు చెందిన లోలపు లక్ష్మి అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

బిడ్డ కాన్పుకూ డబ్బుల్లేవు
‘నోట్ల రద్దు’ సమస్య నల్లగొండ జిల్లా శాలిగౌరారం పరిధిలోని జాలోనిగూడానికి చెం దిన చీమల అవిలయ్య అనే సన్నకారు రైతుతో కన్నీరు పెట్టించింది. ఆయన చిన్న కుమార్తె నిండు గర్భిణి. సోమవారం పురిటినొప్పులు రావడంతో నార్కట్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. అయితే చేతిలో డబ్బుల్లేక ఏం చేయాలో తెలియని స్థితి పడిపోయాడు. కొందరు బంధువుల సూచన మేరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి ఆమెను తరలించినా.. ముందుగా రూ.20 వేలు కట్టాలన్నారు. సోమవారం సెలవు కావడంతో అవిలయ్య మంగళవారం డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వెళితే.. ‘నో క్యాష్‌’ బోర్డు వెక్కిరించింది. దీంతో బోరుమన్న అవిలయ్య చివరికి డబ్బులను ఆస్పత్రి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తానంటూ నిర్వాహకులను బతిమాలుకుని, వైద్యం చేయాల్సిందిగా ఒప్పించాడు.

ఇంత అవస్థలోనూ..
పెద్దపల్లి జిల్లా మారేడుగొండకు చెందిన సిరిసేటి కనకమ్మకు కిడ్నీలు పాడయ్యాయి.. నాలుగు రోజులకోసారి డయాలసిస్‌ చేయిస్తేనే బతుకుతుంది.. బ్యాంకులో డబ్బులున్నా చేతిలో చిల్లిగవ్వ లేదు.. దీంతో డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు మంగళవారం పెద్దపల్లిలోని ఎస్‌బీహెచ్‌ (ఏడీబీ) బ్రాంచికి వచ్చింది. నాలుగు గంటలపాటు క్యూలో నిలుచుంది. తర్వాత పక్కనే బల్లపై కూలబడింది. చివరికి తన వంతు వచ్చినా రూ.2 వేల కంటే ఎక్కువ ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన ‘సాక్షి’ సిబ్బంది, స్థానికులు కలసి ఆ మహిళ దయనీయ స్థితిని బ్యాంకు మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఖాతాలో ఉన్న రూ.30 వేలలోంచి రూ.15 వేలు చెల్లించారు.

సుధీర్‌బాబుపై సస్పెన్షన్‌
సాక్షి, హైదరాబాద్‌: పోస్టల్‌ శాఖలో పెద్ద నోట్ల మార్పిడి అభియోగాలపై సీబీఐ అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ సిటీ రీజియన్‌ సీనియర్‌ సూపరిం టెండెంట్‌ సుధీర్‌బాబుపై కేంద్ర తపాలా శాఖ డైరెక్టరేట్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం తపాలా శాఖాధికారులు చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న సుధీర్‌ బాబుకు సస్పెన్షన్‌ మెమో ప్రతిని అందిం చారు. ఇప్పటికే తపాలా శాఖాధికారులు హిమాయత్‌నగర్‌ సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జి.రేవతి తో పాటు ఆఫీస్‌ అసిస్టెంట్‌ రవితేజలను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement