
కారులో మహిళ మృతదేహం
హత్యగా పోలీసుల నిర్థారణ
పరారీలో భర్త
సనత్‌నగర్: పాడైపోయిన కారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది... తలపై గాయాలుండటంతో ఆమె హత్యకు గురైనట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతురాలి భర్త పరారీలో ఉండటంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేగంపేట ఠాణా పరిధిలో మంగళవారం ఈ దారుణం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ బస్వారెడ్డి కథనం ప్రకారం... ప్రకాశ్‌నగర్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో పద్మ (35), నర్సింహ్మ (40) దంపతులు ఉంటున్నారు.
పిల్లలను హాస్టల్‌లో చేర్పించి భార్యాభర్తలు చెత్తకాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. ఇల్లు లేకపోవడంతో స్థానికంగా ఉన్న చెట్ల కిందనే కాలం గడుపుతున్నారు. వర్షం వచ్చిన సమయంలో మాత్రం అక్కడే రోడ్డు పక్కన ఉన్న పాడైన కారును షెల్టర్‌గా వాడుకుంటున్నారు. మూడు రోజులుగా ఈ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తోంది. అక్కడి డస్ట్‌బిన్ నుంచి వాసన వస్తోందేమోనని స్థానికులు పట్టించుకోలేదు. అయితే, డస్ట్‌బిన్‌లోని చెత్తను తరలించినప్పటికీ దుర్వాసన వస్తుండటంతో స్థానికులకు మంగళవారం అనుమానం వచ్చి పరిశీలించగా కారులో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది.
వెంటనే వారు బేగంపేట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సీఐ బస్వారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహం పద్మదిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతదేహం కుళ్లిపోవడం బట్టి నాలుగైదు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. నర్సింహ్మ, పద్మలు కొంతకాలంగా గొడవపడుతున్నారని, రోజూ నర్సింహ్మ తాగి వచ్చి భార్యను కొట్టేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. తలపై గాయాలు ఉండటంతో ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు.
మృతురాలి భర్త అదృశ్యం కావడంతో అతడే చంపి పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సంహ్మ కోసం గాలిస్తున్నామని, అతను దొరికితే పూర్తి వివరాలు బయటకు వస్తాయని సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని బేగంపేట్ ఏసీపీ గణేష్‌రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.