అన్నింటికీ ఆధార్
నల్లగొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డు తప్సనిసరి కానుంది. ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు తోడుగా మరికొన్ని పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానం చేయనున్నారు. మార్చి నాటికి అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన నేపథ్యంలో... త్వరలో ఆధార్‌కార్డు ప్రాధాన్యం మరింత పెరగనుంది. అయితే జిల్లాలో ఆధార్ కార్డు జారీ ప్రక్రియ 95 శాతం పూర్తయింది. కానీ గతేడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా జిల్లా లో కుటుంబాలు పెరిగాయి. దీంతో పాత గణాంకాల ప్రకారం కాకుండా సమగ్ర కుటుంబ సర్వే డేటా ప్రకారం చూస్తే ఆధార్‌కార్డు లేని కుటుంబాలు మరింత పెరిగాయి.
ఇదీ.. ఆధార్ లెక్క....
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 34,83,648 మంది జనాభా ఉన్నారు. అధికారుల వివరాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో 32,92,327 మందికి ఆధార్ జారీ చేశారు. ఇంకా 1,91,321 మందికి ఆధార్ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.75 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అయితే గతేడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్రకుటుంబ సర్వేలో ఇంటింటికి వెళ్లి నంబర్లు వేయడం ద్వారా కుటుంబాల సంఖ్య 11.50 లక్షలకు చేరింది. జాతీయ గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతి ఏడాది సగటున 2 శాతం కుటుంబాలు పెరుగుతాయనేది అంచనా. ఉదాహరణకు లక్ష ఇళ్లు ఉంటే ఏడాదిలో వాటి సంఖ్య 2 వేలకు పెరగడం లేదా తగ్గడం జరగాలి. కానీ ప్రభుత్వం సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల ఇరుగు, పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో నివసిస్తున్న జిల్లావాసులందరూ సర్వేకు తరలిరావడం వల్ల కుటుంబాల సంఖ్య పెరిగాయనేది అధికారుల వాదన. ఏదేమైనప్పటికీ సమగ్ర కుటుంబ సర్వే తేల్చిన లెక్కలు, ఆధార్ కార్డు పొందాల్సిన వారితో కలిపి మొత్తం సుమారు 4 లక్షల మంది ఆధార్ కార్డులేని వారు ఉండొచ్చునని అధికారుల అంచనా.
నత్తనడకన ఆధార్ అనుసంధానం..
గ తేడాది సాధారణ ఎన్నికలకు ముందు నిలిపేసిన ఆధార్ అనుసంధానం ప్రక్రియ మళ్లీ ప్రారంభంకానుంది. కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకానికి ఆధార్ అనుసంధానం చే యడం ద్వారా మిగిలిన పథకాలకు దానిని వర్తింపజేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో అమలవుతున్న పథకాలన్నింటికీ ఆధార్‌కార్డు అనుసంధించాలని నిర్ణయించింది. జిల్లాలో ఇప్పటికే ఆహార భద్రత, పెన్షన్లు, ఉపకార వేతనాలు, ఉపాధిహామీ, వంటగ్యాస్ తదితర పథకాలకు ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మార్చి నాటికి కార్డులేని వారికి కొత్త కార్డులు ఇవ్వడంతోపాటు, బ్యాంకు ఖాతాలు లేని వారు తప్పనిసరిగా ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆధార్ కార్డులను అనుసంధానించే ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంది.
ప్రత్యేక కౌంటర్లు..
ఆధార్‌కార్డు పొందేందుకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోని మీసేవ కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మీ సేవ నిర్వాహకులకు ఎలాంటి రుసుమూ చెల్లించకుండా ప్రజలు ఉచితంగానే ఆన్‌లైన్‌లో ఆధార్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు కాబట్టి ఆధార్ కార్డులు ఉచితంగానే పొందవచ్చు. ఆధార్‌కార్డు పొగొట్టుకున్నా లేదా కార్డుల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీ సేవ కేంద్రాల్లో వెళ్లినట్లయితే ఆన్‌లైన్‌లో వాటిని సరిచేసి డూప్లికేట్ కార్డు జారీ చేస్తారు. ఏదేని కారణాల వల్ల దరఖాస్తు రిజక్ట్ అయినట్లయితే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గుర్తింపు ధ్రువీకరించే పత్రాలు
పాస్‌పోర్టు, పాన్‌కార్డు, రేషన్/పీడీఎస్ ఫొటో కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన ఫొటో ఐడీ, ఆయుధాల లెసైన్సు, ఫొటో బ్యాంకు ఏటీఎం కార్డు, ఫొటో క్రెడిట్ కార్డు, పింఛన్‌దారు ఫొటోకార్డు, కిసాన్ ఫొటో పాస్‌పుస్తకం, తపాలశాఖ జారీ చేసిన పేరు, ఫొటో ఉన్న చిరునామా కార్డు, లెటర్ హెడ్‌పై గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ జారీ చేసిన ఫొటో ఉన్న గుర్తింపు ధ్రువపత్రం, సంబంధిత రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రభుత్వాలు/ పరిపాలక సంస్థలు జారీ చేసిన వికలత్వ ఐడీ కార్డు/ వికలాంగ వైద్య ధ్రువపత్రం.
మీ మొబైల్ ఫోన్‌పై మీ ఆధార్ గురించి...
ఠజీఛీ ట్ట్చ్టఠట (14 ఛీజీజజ్టీ ్ఛజీఛీ) టైప్ చేసి 51969 కు ఎస్‌ఎంఎస్ చేయండి
ూ మీ ఆధార్ నంబర్ ఉత్పన్నం అయి ఉంటే ఆ నంబరు మీ మొబైల్‌కు వస్తుంది.
ూ ఆధార్‌నంబర్ ఉత్పన్నం కానట్లయితే మీ ఆ దార్ సంబంధించిన వివరాలు తెలియజేస్తారు.
గమనిక : 14 అంకెల ఈఐడీ నంబరు ఆధార్ నమోదు రశీదుపై ఉంటుంది.
ూ ఆధార్ నమోదు సమయంలో మీ మొబైల్ నంబరు ఇచ్చినట్లయితే ఆ నంబరుకు ఎస్‌ఎంస్ ద్వారా ఆధార్ నంబర్ వస్తుంది.
ూ ఆధార్ నమోదు సమయంలో మీ మొబైల్ నెంబరు ఇవ్వనట్లయితే ప్రస్తుతం ఏ నంబరు ద్వారా ఎస్‌ఎంఎస్ చేశారో ఆ నంబరుకు ఆధార్ వివరాలు తెలియజేస్తారు. (నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబరు కానందువల్ల మీకు ఎస్‌ఎంఎస్ ద్వారా ఆధార్ నంబర్‌కు పంపిస్తారు.)
ఆధార్ అనుసంధానం చే స్తున్న పథకాలు
1. ఉపకార వేతనాలు
2. ఆహార భద్రత
3. పెన్షన్లు
4.ఇందిరాగాంధీ మాతృత్వ యోజన(ఐజీఎంఎస్‌వై)
5. జననీ సురక్ష యోజన
6. నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్‌షిప్స్
7. నగదు బదిలీ (వంట గ్యాస్)
8. ఉపాధి హామీ పథకం.