న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి చివరి తేదీని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. సంచిత నిధి నుంచి నిధులు అందే ప్రజా పంపిణీ వ్యవస్థ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పెన్షన్లు, ఉపకార వేతనాలు, గ్యాస్, ఎరువుల సబ్సిడీలు తదితర పథకాలకు ఇది వర్తిస్తుంది. తొలుత నిర్ణయించిన దాని ప్రకారం ఆ గడువు ఈ నెల 31న ముగియాల్సి ఉంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఈ మేరకు గడువును పొడిగిస్తూ ప్రకటన జారీచేసింది.
మూడు నెలల గడువు ఇచ్చినా, సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే మాత్రం మార్చి 31 తరువాత ప్రజలు ఆధార్ సంఖ్య లేదా ఆధార్‌కు నమోదు చేసుకున్నట్లు చూపే ఎన్‌రోల్‌మెంట్ రశీదును సమర్పించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆధార్ లేని కారణంగా నిజమైన లబ్ధిదారులెవరూ నష్టపోకూడదనే తాజాగా గడువు పెంచినట్లు పేర్కొన్నాయి. బ్యాంకు ఖాతాలు–ఆధార్ అనుసంధానాన్ని బ్యాంకులు కొనసాగించొచ్చని, ఆధార్ లేనంత మాత్రాన బ్యాంకు ఖాతాలను రద్దుచేయొద్దని యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment