న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎంత మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారో తమ వద్ద అధికారిక సమాచారం లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ వల్ల పౌరులకు పటిష్టమైన, జీవితాంతం ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోగల గుర్తింపుకార్డు లభించిందని ఉద్ఘాటించింది. ఆధార్ నమోదుకు వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, కంటి పాపకు సంబంధించిన వివరాలు మినహా కులం, మతం, భాష లాంటి సమాచారం కోరడం లేదంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే ఆధార్ నిర్వహణ, అమలు తీరుతెన్నులను వివరిస్తూ గురువారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమాచార భద్రత, ఆధార్ సాకుతో ప్రజలకు ప్రభుత్వ పథకాల నిరాకరణ వంటి అంశాలపై బెంచ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.ఆధార్‌తో జరిపే లావాదేవీలపై యూఐడీఏఐ నిఘా పెట్టదని పేర్కొన్నారు. ప్రామాణిక ఎన్‌క్రిప్షన్ రేటు 256 కాగా, ఆధార్ వ్యవస్థ నిర్వహణకు 2048 బిట్ల ఎన్‌క్రిప్షన్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా ముగిసిన ఈ ప్రజెంటేషన్ ఈనెల 27న కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment