UIDAI CEO
-
ఆధార్ గోప్యతను కాపాడండి
న్యూఢిల్లీ: దమ్ముంటే తన ఆధార్‌ను దుర్వినియోగం చేయాలంటూ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ గతంలో ఆధార్ నంబర్‌ను బయటకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు హ్యాకర్లు శర్మకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను బయటపెట్టారు. దీంతో ఆధార్ సమాచార గోప్యతపై పౌరులకు సూచనలు చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నిర్ణయించింది. ఇందులోభాగంగా పాన్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డు తరహాలో కాకుండా ఆధార్ నంబర్ గోప్యతను కాపాడుకోవాలని యూఐడీఏఐ చెప్పనుంది. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో 12 అంకెల ఆధార్ నంబర్‌ను పంచుకోవడంపై హెచ్చరించనున్నట్లు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా ఆధార్ కార్డును వాడుకునేందుకు వీలుగా అనుమానాలను తీర్చడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ విషయంలో ప్రజలకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు, వాటి సమాధానాలను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. బయోమెట్రిక్స్, వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వంటి రక్షణ వ్యవస్థలు ఉన్న ఆధార్‌లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ట్రాయ్ చైర్మన్ శర్మ ఉదంతం నేపథ్యంలో 12 అంకెలున్న ఆధార్ నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని యూఐడీఏఐ ప్రజలను హెచ్చరించింది. -
పథకాలకు ఆధార్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి చివరి తేదీని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. సంచిత నిధి నుంచి నిధులు అందే ప్రజా పంపిణీ వ్యవస్థ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పెన్షన్లు, ఉపకార వేతనాలు, గ్యాస్, ఎరువుల సబ్సిడీలు తదితర పథకాలకు ఇది వర్తిస్తుంది. తొలుత నిర్ణయించిన దాని ప్రకారం ఆ గడువు ఈ నెల 31న ముగియాల్సి ఉంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఈ మేరకు గడువును పొడిగిస్తూ ప్రకటన జారీచేసింది. మూడు నెలల గడువు ఇచ్చినా, సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే మాత్రం మార్చి 31 తరువాత ప్రజలు ఆధార్ సంఖ్య లేదా ఆధార్‌కు నమోదు చేసుకున్నట్లు చూపే ఎన్రోల్మెంట్ రశీదును సమర్పించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆధార్ లేని కారణంగా నిజమైన లబ్ధిదారులెవరూ నష్టపోకూడదనే తాజాగా గడువు పెంచినట్లు పేర్కొన్నాయి. బ్యాంకు ఖాతాలు–ఆధార్ అనుసంధానాన్ని బ్యాంకులు కొనసాగించొచ్చని, ఆధార్ లేనంత మాత్రాన బ్యాంకు ఖాతాలను రద్దుచేయొద్దని యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ సూచించారు. -
ఆధార్ ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయాలంటే..
న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదోపవాదోల నేపథ్యంలో యూఐడీఏఐ, కోర్టు ముందు ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజెంటేషన్‌లో ఆధార్ సిస్టమ్‌లో భద్రతా చర్యలపై యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే ఐదుగురు సభ్యుల బెంచ్‌కు వివరించారు. అదేవిధంగా పిటిషనర్లు క్లయిమ్స్ కూడా బెంచ్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆధార్ డేటా చాలా సురక్షితమని, 2048 బిట్ ఎన్క్రిప్షన్ సిస్టమ్‌తో ఇది చాలా భద్రంగా ఉంటుందని పాండే తెలిపారు. ఫైనాన్సియల్ సిస్టమ్స్‌లో వాడే సాధారణ ఎన్క్రిప్షన్ కంటే ఇది ఎనిమిది రెట్లు బలమైనదని తెలిపారు. అంతేకాక ఈ ఎన్క్రిప్షన్ను విచ్ఛిన్నం చేయాలంటే విశ్వమంత బలం అవసరమని చెప్పారు. అనుమతి లేకుండా అసలు ఆధార్ డేటా షేర్ చేయమని, అసాధారణ పరిస్థితుల్లో జిల్లా జడ్జి అనుమతి లేకుండా కూడా షేర్ చేయలేమన్నారు. 2009 ముందు వరకు సిటిజన్లకు ఎలాంటి గుర్తింపు డాక్యుమెంట్ లేదని, తాను కూడా ఎలాంటి ఐడీ లేకుండా చిన్న ఊరి నుంచి వచ్చిన వాడేనని పాండే తెలిపారు. అయితే 49వేల మంది ఎన్రోల్మెంట్ ఆపరేటర్ల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేశారని, వారు అవినీతికి పాల్పడటం లేదు, ఇంకా అక్కడ తక్కువ డెమొగ్రాఫిక్ డేటా కూడా లేదు? అని జస్టిస్ సిక్రి ప్రశ్నించగా.. యూఐడిఏఐకి చాలా కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు ఉన్నాయని పాండే పునరుద్ఘాటించారు. బయోమెట్రిక్స్ వివరాలు సరితూగకపోతే, సర్వీసులు అందించడం నిరాకరిస్తున్న వాటిపై కూడా బెంచ్ సభ్యుల నుంచి పాండేకి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే బయోమెట్రిక్ వివరాలు ఫెయిల్ అయితే, ప్రయోజాలు అందించడం నిరాకరించకూడదని కఠిన ఆదేశాలను అథారిటీ జారీచేసినట్టు పాండే తెలిపారు. వీటి కోసం వన్‌టైమ్ పాస్వర్డ్, డెమొగ్రాఫిక్ అథెంటికేషన్ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. కేవలం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల వద్ద మాత్రమే కాక, జైళ్ల వద్ద కూడా ఎన్రోల్మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రతి రోజూ 4 కోట్ల అథెంటికేషన్లను చేపడుతున్నామని తెలిపారు. -
ఆధార్: కేంద్రానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్‌పై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ఆధార్ విచారణలో కేంద్రానికి స్వల్ప ఊరట లభించింది. ఆధార్ గోప్యతపై దాఖలైన పిటిషన్లు విచారిస్తున్న అత్యున్నత న్యాయస్థానం..ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) గురువారం కీలక అనుమతి నిచ్చింది. సాంకేతిక సమస్యలపై పలువురు లేవనెత్తిన అంశాల నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్‌ను ఇవ్వనున్నారు.. దీంతో యుఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే ఈ మధ్యాహ్నం 2.30గంటలకు కోర్టుముందు ఈ ప్రెజంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు యుఐడీఏఐ పీపీపీ ప్రదర్శన అనంతర తమ ప్రశ్నల జాబితాను సిద్ధం చేయాలని పిటిషనర్లను సుప్రీం కోరింది. అనేకమంది లేవనెత్తిన సందేహాలు, భయాలకు ఈ పీపీపీలో సంస్థ నివృత్తి చేయనుందని అంచనా. -
ఆధార్‌కు ‘బయోమెట్రిక్’ భద్రత
న్యూఢిల్లీ: ఆధార్ నమోదు, మార్పులు చేర్పుల దరఖాస్తులపై ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టాఫీస్, బ్యాంకు సిబ్బంది బయోమెట్రిక్ సంతకం చేసేలా ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త విధానం తీసుకురానుంది. పౌరుల బయోమెట్రిక్, ఇతర కీలక సమాచారం భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే చెప్పారు. ఈ వ్యవస్థ జనవరి కల్లా అమల్లోకిరావచ్చు. ఆధార్ దరఖాస్తు స్వీకరించగానే సంబంధిత సిబ్బంది దానిపై బయోమెట్రిక్ సంతకం చేయాలి. ఇప్పుడు అధీకృత ప్రైవేట్ ఆపరేటరే దరఖాస్తుపై సంతకం చేస్తున్నారని ఇకపైప్రభుత్వ, పోస్టాఫీస్, బ్యాంకు సిబ్బంది దానిపై బయోమెట్రిక్ రూపంలో కౌంటర్ సంతకం చేస్తారు. -
'విద్యార్థులకు స్పీడ్ గా ఆధార్ కార్డులు'
న్యూఢిల్లీ: విద్యార్థులు ఉపకార వేతనం అందుకోవటంలో ఇబ్బందుల్లేకుండా త్వరితగతిన ఆధార్‌కార్డు మంజూరు చేయడానికి యూఐడీఏఐ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆగస్టు 15 లోపు ఆధార్‌కు నమోదు చేసుకునే విద్యార్థులకు తొందరగా కార్డులిస్తామని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. విద్యార్థులకు ఆధార్ కార్డులు ఇప్పించే బాధ్యత పాఠశాలలదేనని, దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రాలకు పిల్లలను తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఆధార్ కార్డు కలిగిన విద్యార్థులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఎటువంటి ఆటంకాలూ లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే పొందొచ్చు. ఇప్పటిదాకా దేశంలో 103.5 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు. దేశ జనాభాలోని పెద్దలలో 97 శాతం మందికి ఆధార్ కార్డులుండగా, 5-18 ఏళ్లలోపు పిల్లల్లో మాత్రం 64 శాతం మందికే ఆధార్ కార్డులున్నాయి.