న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదోపవాదోల నేపథ్యంలో యూఐడీఏఐ, కోర్టు ముందు ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజెంటేషన్‌లో ఆధార్ సిస్టమ్‌లో భద్రతా చర్యలపై యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే ఐదుగురు సభ్యుల బెంచ్‌కు వివరించారు. అదేవిధంగా పిటిషనర్లు క్లయిమ్స్ కూడా బెంచ్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆధార్ డేటా చాలా సురక్షితమని, 2048 బిట్ ఎన్‌క్రిప్షన్ సిస్టమ్‌తో ఇది చాలా భద్రంగా ఉంటుందని పాండే తెలిపారు. ఫైనాన్సియల్ సిస్టమ్స్‌లో వాడే సాధారణ ఎన్‌క్రిప్షన్ కంటే ఇది ఎనిమిది రెట్లు బలమైనదని తెలిపారు. అంతేకాక ఈ ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయాలంటే విశ్వమంత బలం అవసరమని చెప్పారు. అనుమతి లేకుండా అసలు ఆధార్ డేటా షేర్ చేయమని, అసాధారణ పరిస్థితుల్లో జిల్లా జడ్జి అనుమతి లేకుండా కూడా షేర్ చేయలేమన్నారు.
2009 ముందు వరకు సిటిజన్లకు ఎలాంటి గుర్తింపు డాక్యుమెంట్ లేదని, తాను కూడా ఎలాంటి ఐడీ లేకుండా చిన్న ఊరి నుంచి వచ్చిన వాడేనని పాండే తెలిపారు. అయితే 49వేల మంది ఎన్‌రోల్‌మెంట్ ఆపరేటర్ల లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేశారని, వారు అవినీతికి పాల్పడటం లేదు, ఇంకా అక్కడ తక్కువ డెమొగ్రాఫిక్ డేటా కూడా లేదు? అని జస్టిస్ సిక్రి ప్రశ్నించగా.. యూఐడిఏఐకి చాలా కఠినమైన నాణ్యత నియంత్రణ ప్రమాణాలు ఉన్నాయని పాండే పునరుద్ఘాటించారు. బయోమెట్రిక్స్ వివరాలు సరితూగకపోతే, సర్వీసులు అందించడం నిరాకరిస్తున్న వాటిపై కూడా బెంచ్ సభ్యుల నుంచి పాండేకి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే బయోమెట్రిక్ వివరాలు ఫెయిల్ అయితే, ప్రయోజాలు అందించడం నిరాకరించకూడదని కఠిన ఆదేశాలను అథారిటీ జారీచేసినట్టు పాండే తెలిపారు. వీటి కోసం వన్‌టైమ్ పాస్‌వర్డ్, డెమొగ్రాఫిక్ అథెంటికేషన్ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. కేవలం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల వద్ద మాత్రమే కాక, జైళ్ల వద్ద కూడా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రతి రోజూ 4 కోట్ల అథెంటికేషన్లను చేపడుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment