మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర పాలకుల పుణ్యమాని ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు ఉన్నత వర్గాల వారి నడ్డి విరిచాయి. ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ధరలు చూసి జనం గుండెలు బాదుకుంటున్నారు. ఏటి కేడు ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కన్నీళ్లు పెట్టిస్తే బడుగులు కారం మెతుకులు, తొక్కుతో కాలం వెళ్లదీస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో బండికి బదులు సైకిలే నయ్యం అనుకుంటున్నారు. ఇక గ్యాస్ ధరదడ పుట్టిస్తుంటే కట్టెల పొయ్యిపైనే వంట కానిచ్చేస్తున్నారు. కానీ, ధరలను నియంత్రించడంలో మాత్రం పాలకులు వైఫల్యం చెందారు. ప్రతీ ఎన్నికల్లో పాలకులు ధరల ప్రస్తావన తీసుకొస్తారు. అన్ని వస్తువుల ధరలు తగ్గిస్తామని హామీలు ఇవ్వడం అనంతరం మరచిపోవడం ఆనవాయితీగా వస్తోంది.
చుక్కలనంటుతున్న ధరలు
పెరుగుతున్న ధరలు చూసి ప్రజలు విలవిలలాడుతున్నారు. పెరగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో వచ్చిన జీతం, కూలీ డబ్బులు సరుకుల కొనుగోలుకు సరిపోవడం లేదు. మూడేళ్లలో ధరలు విపరీతంగా పెరిగాయి. బియ్యం, పప్పు, చక్కెర, డీజిల్, పెట్రోల్, ఆర్టీసీ, రైలు, వంట గ్యాస్, పండ్లు, కూరగాయలు, విద్యుత్ చార్జీలు ఇలా అన్నింటి ధరలు అందనంత ఎత్తు ఎగిసి పడుతున్నాయి. ఆరు సంవత్సరాలు క్రితం వంట గ్యాస్ ధర రూ.305.60 ఉండగా ఇప్పుడు రూ.442.50కి పెరిగింది. 2000 సంవత్సరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.21.32 ఉండగా. డీజిల్ లీటర్ రూ.15.61 ఉంది. ఇప్పుడు ఆ రెండింటి ధరలు చూస్తే ఎంతో వ్యత్యాసం ఉంది. పెట్రోల్ లీటర్ రూ.78.02, డీజిల్ రూ.60.93 ఉంది. ఈ రెండింటి ధరల పెరుగుదల వలన ఆర్టీసీ, ఆటో, అద్దె వాహనాల చార్జీలు పెరిగాయి.
విద్యుత్ చార్జీల మోత భరించలేనంతగా ఉంది. సర్‌చార్జీలు, సుంకం ఇలా బిల్లు తడిసిమోపడవుతోంది. ఒకప్పుడు రూ.100 వచ్చిన బిల్లు ఇప్పుడు రూ.300 నుంచి రూ.500 వరకు వస్తోంది. ఎరువులు, విత్తనాలు ధరలు 2009లో రూ.278 ఉండగా ప్రస్తుతం రూ.1,150, విత్తనాల ధర 2011లో రూ.750 ఉండగా ఇప్పుడు రూ.930కి పెరిగాయి. 2009లో బియ్యం క్వింటాలు ధర రూ.1,600 ఉండగా ఇప్పుడు రూ.5వేలు వరకు చేరింది. ఇలా ధరలు ఏటా పెరుగుతు సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. గత పాలకులు మాత్రం ఓట్లు వేయించుకుని అనంతరం ధరల విషయం మరచిపోయారు. వచ్చే పాలకులు అయిన ధరల విషయం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
ధరల మంట
Published Mon, Apr 28 2014 1:32 AM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM
Advertisement
Advertisement