
ఏసీబీ వలలో సర్వేయర్లు
ఎడపల్లి: అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ) పంజా విసురుతూనే ఉన్నా.. లంచావతారులు మారడం లేదు. జిల్లాలో ఏసీబీ దాడుల్లో చిక్కుతున్న ప్రభుత్వ సిబ్బంది జాబితా పెరుగుతూనే ఉంది. ఉన్నతాధికారులు మొదలు చిరు ఉద్యోగి దాకా అవినీతి అధికారుల వలలో పడుతున్నారు. చిన్న పనులకు సైతం రేట్లు కడుతూ.. ప్రభుత్వ వ్యవస్థపైనే అసహ్యం కలిగిస్తున్నారు. ఎడపల్లి మండలంలో మంగళవారం తొలిసారి ఏసీబీ దాడులు చేపట్టింది.
మండలానికి చెందిన ఇద్దరు ఐకేపీ, రెవెన్యూశాఖల సర్వేయర్లు రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన మండలంలో సంచలనం రేకెత్తించింది. మండలంలోని జంలం గ్రామానికి చెందిన రైతు ఎం.ఎస్ అబ్ధుల్లా సర్వేనంబర్ 79/1 లో గల ఒక ఎకరం ఎనిమిది గుంటల తన వ్యవసాయ భూమిని సర్వే చేయమని చెప్పి.. 2013లో ఐకేపీ, రెవెన్యూ సర్వేయర్లు మోహన్, సంజీవ్‌రాథోడ్‌లకు విన్నవించారు.
ఇందుకు వారు భూమి సర్వే కోసం చలాన్ కట్టమన్నారు. దాని ప్రకారం అబ్ధుల్లా చలాన్ కట్టారు. అయినా దాదాపు పదినెలలుగా ఆయనను రేపుమాపు అంటూ తమ చుట్టూ తిప్పుకున్నారు. చివరకు వారి అంతరంగాన్ని పసిగట్టిన అబ్దుల్లా ఏమైనా డబ్బులు కావాలంటే ఇస్తానని చెప్పడంతో.. ఆశపడ్డ సర్వేయర్లు రూ. పదివేలు ఇస్తే భూమిని సర్వే చేస్తామని తేల్చిచెప్పారు. ఇందుకు అంగీకరించిన అబ్దుల్లా డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు.
మంగళవారం రూ. ఐదువేలు ఇస్తానని, భూమి సర్వే చేసిన అనంతరం మిగిలిన రూ. ఐదువేలు ఇస్తానన్నారు. అనంతరం ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించారు. జరిగిన విషయాన్ని వారికి వివరించారు. అనంతరం ఏసీబీ అధికారులు అబ్దుల్లాకు కొన్ని సూచనలు ఇచ్చి పకడ్బందీ పథకంతో ముందుకు సాగారు. దీని ప్రకారం అబ్దుల్లా మంగళవారం జాన్కంపేట్ రెవెన్యూ అధికారి కార్యాలయంలో సర్వేయర్ మోహన్‌కు రూ. మూడువేలు, అసిస్టెంట్ సంజీవ్ రాథోడ్‌కు రూ. రెండువేలు అందించారు.
డబ్బులు వారి చేతికి అందిన వెంటనే ఏసీబీ డీఎస్పీ సంజీవరావు తన సిబ్బందితో దాడి చేసి సర్వేయర్లను పట్టుకున్నారు. అబ్ధుల్లా నుంచి వారు ఐదువేలు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో వారిద్దరిని అరెస్టు చేసి, హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు.
అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు హెచ్చరించారు. లంచం తీసుకోవడంతో పాటు ఇవ్వడం కూడా నేరమేనని ఆయన స్పష్టంచేశారు. ఏ అధికారి లంచం అడిగినా ఏసీబీని సంప్రదించాలన్నారు. సెల్‌నంబర్ 94404 46155కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.