మెతుకు సీమకు హరిత హారం!
మెదక్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా మెతుకుసీమను హరిత హారంగా తీర్చిదిద్దడానికి అటవీ శాఖ అధికారులు ఉద్యుక్తులవుతున్నారు. బీడు భూములను సిరుల ముల్లెలుగా మార్చేందుకు అటవీ శాఖ సమాయత్తమవుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించి.. పాడి పంటల తెలంగాణను.. కోటి రతనాల వీణగా మార్చేందుకు మన గ్రామం.. మన ప్రణాళిక పేరుతో బృహత్ ప్రణాళికకు ఊపిరి పోస్తున్నారు. ఈ క్రమంలో ఈ యేడు మెతుకుసీమలో 47.24 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా హరిత హననంపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జాతీయ అటవీ చట్టం ప్రకారం 33 శాతం అడవులు ఉండాలి. కాని జిల్లాలో సుమారు 21 శాతం అటవీ భూములు ఉ న్నట్లు తెలుస్తోంది. కాగా అటవీయేతర ప్రాంతాల్లో ఉన్న హరిత సంపదను పరిగణనలోకి తీసుకుంటే ఒక శాతం పెరిగే ఆస్కారముందని అధికారులు భావిస్తున్నారు. అటవీ శాఖలో సోషల్ ఫారెస్ట్రీ డీఎఫ్‌ఓ కార్యాలయం సంగారెడ్డిలో ఉండగా, టెరిటోరియల్, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌ఓ కార్యాలయాలు మెదక్ పట్టణంలో ఉన్నాయి.
మెదక్ మండలం బూరుగుపల్లి, రాజ్‌పేట, శాలిపేట, మక్తభూపతిపూర్, తిమ్మానగర్, పాపన్నపేట మం డలం ఏడుపాయల, అన్నారం, నామాపూర్, తమ్మాయపల్లి, అర్కెల, చిత్రియాల్, చేగుంట మండలం వల్లూర్, నర్సాపూ ర్, నారాయణఖేడ్, రేగోడ్ తదితర ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి.ఈ యేడు వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా 47.24 లక్షల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. సోషల్ ఫారెస్ట్రీ ద్వారా 1.59 లక్షల మొక్కలు, టెరిటోరియల్ ఫారెస్ట్రీ ద్వారా 6.9 లక్షలు, డ్వామా ద్వారా 33 లక్షలు, హర్టికల్చర్ ద్వారా 25 వేలు, ఇతర శాఖల ద్వారా 5.5 లక్షల పైచిలుకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కో క్లస్టర్ పంచాయతీలో నర్సరీల ను ఏర్పాటు చేసి ఒక్కో గ్రామంలో యేడాదికి 33 వేల చొప్పున మూడేళ్లలో లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మన గ్రామం..మన ప్రణాళికలో మొక్కల పెంపకానికి ప్రథమ ప్రాధాన్యత ఇ స్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మరిన్ని మొ క్కలు నాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అడవులను ఆక్రమిస్తే కఠిన చర్యలు
అడవులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టెరిటోరియల్ ఫారెస్ట్ డీఎఫ్‌ఓ సోనిబాలదేవి హెచ్చరించారు. అడవులు నాశనం చేయకుండా బౌండరీలు ఏర్పా టు చేస్తున్నామని, ఉపగ్రహ వ్యవస్థను ఉపయోగించుకుని అటవీ సరిహద్దులు గుర్తిస్తున్నామని చెప్పారు. అడవులు ఆక్రమణకు గురైన ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. వివాదంగా ఉన్న భూముల్లో అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. మొక్కలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో, చెరువు గట్లపై, రోడ్లకు ఇరువైపుల, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పచ్చని చెట్లే మానవాళి మనుగడకు ఆధారమన్న విషయాన్ని గుర్తించాలని ఆమె సూచించారు.
లక్ష టేకు మొక్కలు నాటేందుకు చర్యలు
తూప్రాన్: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలో ‘తెలంగాణకు హరిత హరం’ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు సోషల్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ విజయరాణి పేర్కొన్నారు. తూప్రాన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో లక్ష టేకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల పాటు కొనసాగేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు ఉన్నాతాధికారుల నుంచి ఆదేశాలు రానున్నాయని వివరించారు. ఇదిలా ఉంటే తూప్రాన్ మండలం మనోహరాబాద్ గ్రామ సమీపంలోని సెంటర్ నర్సరీ నుంచి ప్రస్తుత వర్షాకాలంలో 50 వేల మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.