టీడీపీ కార్యాలయానికి భౌతికకాయం తరలింపునకు నో! | Actor Harikrishna Died In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు టెర్రర్‌కు హరికృష్ణ బలి

Published Thu, Aug 30 2018 1:06 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Actor Harikrishna Died In Road Accident - Sakshi

నందమూరి హరికృష్ణ (ఫైల్‌ ఫోటో)

రోడ్డు టెర్రర్‌.. నందమూరి కుటుంబంలో మరొకరిని బలి తీసుకుంది. మితిమీరిన వేగం ఓ నిండు ప్రాణాన్ని గాలిలో కలిపేసింది. ఎన్టీఆర్‌ తనయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నార్కెట్‌పల్లి– అద్దంకి రహదారిలో అన్నెపర్తి పోలీస్‌ బెటాలియన్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. హరికృష్ణ స్వయంగా నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న ఆయన్ను స్థానికులు హుటాహుటిన సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఉదయం 7.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి, హైదరాబాద్‌లోని హరికృష్ణ నివాసానికి తరలివచ్చారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కాగా, హరికృష్ణ భౌతికకాయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలించాలంటూ చంద్రబాబు తన పార్టీ నేతలతో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను అడిగించగా.. వారు అందుకు నిరాకరించినట్లు తెలిసింది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్‌: నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎన్టీఆర్‌ తనయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నార్కెట్‌పల్లి– అద్దంకి రహదారిలో అన్నెపర్తి పోలీస్‌ బెటాలియన్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

అసలేం జరిగింది...!
నెల్లూరు జిల్లా కావలిలో ఒక వేడుకలో పాల్గొనేందుకు నందమూరి హరికృష్ణ తన ఇద్దరు మిత్రులు అరికెపూడి శివాజీ, రావి వెంకటరావులతో కలిసి హైదరాబాద్‌లో తన ఇంటి నుంచి ఫార్చ్యూనర్‌ వాహనంలో ఉదయం 4.30 గంటలకు  బయలుదేరారు. డ్రైవింగ్‌ చేస్తున్న హరికృష్ణ.. అన్నెపర్తి బెటాలియన్‌ సమీపంలోని ఓ మూల మలుపులో వాటర్‌ బాటిల్‌ కోసం వెనక్కి తిరిగారు. దీంతో వారి వాహనం ఎడమవైపు మార్జిన్‌ దిగి, పక్కకు వెళ్లిపోతుండగా.. ముందు సీట్లో కూర్చున్న శివాజీ అప్రమత్తమై హరికృష్ణను హెచ్చరించారు. వెంటనే ఆయన స్టీరింగ్‌ను ఒక్కసారిగా కుడివైపునకు తిప్పారు. అప్పటికే కారు అతివేగంతో ఉండటంతో పూర్తిగా రోడ్డుకు కుడివైపు తిరిగి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పది అడుగుల ఎత్తులో గాలిలోకి ఎగిరి.. ఎదురుగా హైదరాబాద్‌ వైపు వస్తున్న మరో కారు వెనుక భాగాన్ని రాసుకుంటూ వెళ్లి కిందపడి మూడు పల్టీలు కొట్టింది. హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ముందు అద్దాల్లోంచి ఎగిరి అక్కడున్న ఓ కల్వర్టులో పడిపోయారు. దీంతో తలకు తీవ్ర గాయాలై అపస్మారకస్థితికి వెళ్లిపోయారు.

శివాజీ వాహనంలో ఇరుక్కుపోగా, బెటాలియన్‌లో విధులుకు హాజరయ్యేందుకు వెళుతున్న కానిస్టేబుళ్లు రంజిత్, ఉపేందర్‌ ఆయన్ను బయటకు లాగారు. వెనుక సీట్లో కూర్చున్న రావి వెంకటరావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. హరికృష్ణ వాహనం ప్రమాదానికి గురైన సమయంలోనే నల్లగొండ నుంచి హైదరాబాద్‌ మార్గంలో మరో కారు ప్రయాణిస్తోంది. హరికృష్ణ కారు గాలిలోకి ఎగరడంతో ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని పసిగట్టిన ఆ డ్రైవర్‌ చాకచక్యంగా తమ వాహనాన్ని ఎడమవైపున ఉన్న చెట్లలోకి మళ్లించాడు. అయినప్పటికీ, హరికృష్ణ వాహనం ఆ కారును వెనుక వైపు ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న యువకులు స్వల్పంగా గాయపడ్డారు.

15 నిమిషాలు వెతుకులాట...
ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో ఉన్న రావి వెంకటరావు రోడ్డుమీదకు వచ్చి సాయం కోసం ఆపడంతో బెటాలియన్‌ కానిస్టేబుళ్లు రంజిత్, ఉపేందర్‌ ఆగారు. వీరితోపాటు విషయం తెలుసుకున్న మిట్లపల్లి సైదులు అనే వ్యక్తి కూడా అక్కడకు వచ్చారు. తమతో పాటు మరో వ్యక్తి ఉండాలని వెంకటరావు చెప్పడంతో అంతా కలిసి హరికృష్ణ కోసం దాదాపు 15 నిమిషాలపాటు చుట్టుపక్కల వెతికారు. అప్పటికి ప్రమాదం జరిగింది హరికృష్ణకు అన్న విషయాన్ని వెంకటరావు ఎవరికీ చెప్పలేదు. చివరకు కల్వర్టులో పడిపోయి ఉన్న హరికృష్ణను సైదులు గుర్తించారు. కారు పడిపోయిన స్థలానికి, హరికృష్ణ పడిపోయిన కల్వర్టు 30 అడుగుల దూరం ఉండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.

కేసీఆర్, చంద్రబాబు సహా పలువురి నివాళి...
హరికృష్ణ మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలివచ్చారు. తొలుత హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్, జూనియర్‌ ఎన్టీఆర్‌లు కామినేనికి చేరుకున్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తండ్రి మృతదేహం వద్ద ఎవరూ ఉండొద్దని, అక్కడ ఎవరైనా ఉంటే తాము చూడబోమని చెప్పడంతో డాక్టర్లు   అక్కడినుంచి వెళ్లిపోయారు. హరికృష్ణ సోదరి,  దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు కామినేనికి వచ్చి హరికృష్ణ మృతదేహాన్ని చూసి విలపించారు. సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన సోదరుడి మృతదేహాన్ని చూసి మౌనంగా ఉండిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రి లోకేష్‌ హెలికాప్టర్‌లో అన్నెపర్తి 12వ బెటాలియన్‌కు చేరుకుని అక్కడినుంచి కామినేనికి వచ్చారు. చంద్రబాబు వచ్చేవరకు హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం జరపలేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్‌.భాస్కర్‌రావు, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సినీ హీరో జగపతిబాబు కూడా ఆస్పత్రికి వచ్చి.. హరికృష్ణకు నివాళులు అర్పించారు.  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఓదార్చారు. హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్‌ మోహదీపట్నం ఎన్‌ఎండీసీలోని ఆయన ఇంటికి చేర్చారు. అప్పటికే కళ్యాణ్‌రామ్, తారకరత్న, జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లి షాలిని, జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్య ప్రణతి, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిలతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్,  తెలంగాణ సీఎం కేసీఆర్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు కేటీఆర్, ఈటెల, తలసాని, జగదీష్‌రెడ్డి,  పలువురు ఏపీ మంత్రులు, సినీనటులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, మోహన్‌బాబు, మురళీమోహన్, రాంచరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: కేటీఆర్‌  
సాక్షి, హైదరాబాద్‌: హరికృష్ణ పార్థివదేహానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయం వద్ద నివాళ్లు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రేపు సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, హరికృష్ణ కుటుంబ సభ్యులు నిర్ణయించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

‘కారు పల్టీ కొట్టాక కనిపించలేదు’
కారులో వెనుక వైపు కూర్చున్నా. అన్నెపర్తి వద్దకు రాగానే రోడ్డు మూల మలుపులో కారు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగాక అందులో నుంచి నేను బయటకు వచ్చాను. శివాజీ బయటకు వచ్చారు. హరికృష్ణ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత 30 అడుగుల దూరంలో పడిపోయి ఉన్న హరికృష్ణను చూశాం. అప్పుడు కొద్దిగా శ్వాస ఆడుతోంది. – హరికృష్ణ స్నేహితుడు వెంకటరావు



వారం క్రితమే ప్రయాణానికి ప్లాన్‌  
నెల్లూరు ప్రయాణానికి వారం కిందటే ప్లాన్‌ చేశాం. హరికృష్ణ ఎక్కడికి వెళ్లినా నేను తోడుగా ఉంటాను. హరికృష్ణ శివ భక్తుడు. ప్రతి సోమ, శుక్రవారాల్లో ఇంట్లో శంకరుడికి పూజలు చేయనిదే బయటికిరారు. – హరికృష్ణ స్నేహితుడు శివాజీ

మెదడులో రక్తం గడ్డకట్టింది
హరికృష్ణ శరీరం కుడివైపున బాగా గాయాలయ్యాయి. ప్రధానంగా చెంప భాగం పూర్తిగా దెబ్బతింది. కుడి కన్నుపై దెబ్బ తగిలింది. కన్నుకు ఏమీ కాలేదు. తలపై భాగంలో దెబ్బ తగలడంతో అధిక రక్తస్రావం అయింది. దీనికి తోడు మెదడులో రక్తం గడ్డకట్టింది. ఉదయం 6 నుంచి 6.30 సమయంలో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం. ప్రమాద స్థలి నుంచి ఆస్పత్రికి తీసుకువచ్చాక 7.15 గంటల సమయంలో హరికృష్ణ చనిపోయారు. పోస్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని అప్పజెప్పాం.  – వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డి 

       

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement