రాష్ట్రానికి 850 మెగావాట్ల అదనపు విద్యుత్
రాష్ట్రానికి 850 మెగావాట్ల అదనపు విద్యుత్
Published Tue, Mar 10 2015 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
హైదరాబాద్: రానున్న వేసవిలో రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు కొంత మేరకు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వేసవిలో వినియోగం తీవ్ర దశకు చేరుకుంటే రాష్ట్రానికి అదనంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం 850 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను సమీకరించింది. విద్యుత్ వినియోగం హఠాత్తుగా పెరిగిపోయినా.. వెంటనే సరఫరా చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో స్పల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంది.
వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యూనిట్‌కు రూ.6 నుంచి రూ.7.50 చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వేసవి అవసరాలు తీర్చేందుకు ఎంత ధరకైనా విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలి సిందే. దీంతో యూనిట్ విద్యుత్ పూల్ ప్రైస్ రూ.4.50 ఉండ గా.. అదనంగా చెల్లించేందుకు ప్రైవేటు సంస్థలతో ట్రాన్స్‌కో అధికారులు తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఎక్కడి నుంచి ఎంత..?
కేరళలోని కయంకులం ప్లాంట్ నుంచి 500 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను విక్రయించేందుకు ఎన్‌టీపీసీ ముందుకొచ్చింది. ప్రత్యామ్నాయ మార్గంలో సదరన్‌గ్రిడ్ ద్వారా ఈ విద్యుత్ సర్దుబాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కయంకులంలోని 500 మెగావాట్లను తమిళనాడుకు ఇచ్చి, ప్రత్యామ్నాయంగా ఇక్కడి తమ ప్లాంట్ల నుంచి తమిళనాడుకు వెళ్తున్న విద్యుత్‌లో నుంచి 500 మెగావాట్లను రాష్ట్రానికి సర్దుబాటు చేయనుంది. అలాగే కాకినాడలోని సామల్‌కోట్వద్ద గల నాఫ్తా ఆధారిత రిలయన్స్ పవర్ ప్లాంట్’ నుంచి 250 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సైతం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
వీటితో పాటు, 100 మెగావా ట్ల గ్యాస్ ఆధారిత(ఆర్‌ఎల్‌ఎన్‌జీ) విద్యుత్‌కొనుగోలుకు సైతం ప్రభుత్వం ఒప్పందానికి ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా విద్యుత్ కొనుగోలు జరగలేదు. వారం రోజులుగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడిపోవడంతో కొంతమేర విద్యుత్ వినియోగం తగ్గిపోవడమే దీనికి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రం లో సోమవారం 137 మిలియన్ యూనిట్ల డిమాం డ్ ఉండగా, 134 మిలియన్ యూనిట్ల సరఫరా జరిగింది. లోటు 3.2 మిలి యన్ యూనిట్లు మాత్రమే. ఇదిలా ఉండగా.. పవర్ ఎక్స్చేంజీ ల నుంచి ఏ రోజుకు ఆ రోజు అవసరాన్ని బట్టి మరో 200 మెగావాట్ల వర కూ విద్యుత్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement
Advertisement