సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికలకు తాము సంసిద్ధంగా ఉన్నామని అదనపు డీజీ (లా అండ్ ఆర్డర్) జితేంద్ర చెప్పారు. ఎన్నికల సన్నాహకాలపై సోమవారం ఆయన డీఐజీ సంజయ్‌కుమార్ జైన్‌తో కలసి మాట్లాడుతూ.. ఈసీ ఆదేశాల మేరకు తాను ఎన్నికల ఖర్చు పర్యవేక్షణాధికారిగా, సంజయ్‌కుమార్ జైన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిఘా పెంచామన్నారు. ఇప్పటికే 33 జిల్లాల్లో పోలీసులకు ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వల్ల చాలామందికి విధులపై పూర్తిస్థాయి అవగాహన వచ్చిందన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
విధుల్లోకి 75 కంపెనీల కేంద్ర బలగాలు..
రాష్ట్రంలో 54 వేల మంది పోలీసులకు అదనంగా కేంద్రం 145 కంపెనీల పోలీసు బలగాలను ఇచ్చేం దుకు సుముఖత వ్యక్తం చేసిందని, వారం రోజులుగా 75 కంపెనీల బలగాలు ఎన్నికల విధుల్లో చేరిపోయాయని అదనపు డీజీ జితేంద్ర తెలిపారు. ఇప్పటికే సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని అవసరాలకు అనుగుణంగా బలగాలను మోహరిస్తున్నామన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ చేపట్టామన్నారు. ఎన్నికల నాటికి మిగిలిన కంపెనీల బలగాలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అక్రమాలను అడ్డుకునేందుకు 405 ఫ్లయిం గ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ బృందాలు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.7.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11 వేలకు పైగా లైసెన్స్‌డ్ ఆయుధాలున్నాయని, వీటిలో ఇప్పటివరకు 8 వేలకు పైగా ఆయుధాలను సరెండర్ చేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment