Special Forces
-
సీఎం కేసీఆర్ ప్రచార వాహనంలో తనిఖీలు.. ఎక్కడంటే?
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అధికార బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు నిర్వహించాయి. వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్గేట్ వద్ద కేంద్ర బలగాలు నిర్వహించాయి. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు. -
ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
దిస్పూర్: ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. గడిచిన 8 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు మెరుగుపడినట్లు ఆయన తెలిపారు. అస్సాంలోని దింఫలో గురువారం జరిగిన ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఏఎఫ్ఎస్పీఏ అమలుతో ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు 75% తగ్గుముఖం పట్టాయని ప్రధాని అన్నారు. వివిధ సాయుధ గ్రూపులతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని త్రిపుర, మేఘాలయాల్లో ఏఎఫ్‌ఎస్‌పీను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం నాగాలాండ్, మణిపూర్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయని వెల్లడించారు. కర్బి ఆంగ్లాంగ్, ఇతర గిరిజన ప్రాంతాల ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందని ప్రధాని తెలిపారు. దీంతోపాటు, ఈ ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామన్నారు. అస్సాం, మేఘాలయ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని, అభివృద్ధి బాటన పయనించేందుకు సహకరిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కర్బిఆంగ్‌లాంగ్‌లో వెటరినరీ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కళాశాల, మోడల్ కాలేజీ నిర్మాణం తదితర రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. #WATCH | PM Narendra Modi witnesses traditional folk dance at the Khanikar ground in Dibrugarh, Assam PM Modi will soon dedicate six more cancer hospitals to the nation and lay the foundation stones of seven new cancer hospitals in Assam. pic.twitter.com/x9kIx5vpxq — ANI (@ANI) April 28, 2022 -
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికలకు తాము సంసిద్ధంగా ఉన్నామని అదనపు డీజీ (లా అండ్ ఆర్డర్) జితేంద్ర చెప్పారు. ఎన్నికల సన్నాహకాలపై సోమవారం ఆయన డీఐజీ సంజయ్‌కుమార్ జైన్‌తో కలసి మాట్లాడుతూ.. ఈసీ ఆదేశాల మేరకు తాను ఎన్నికల ఖర్చు పర్యవేక్షణాధికారిగా, సంజయ్‌కుమార్ జైన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిఘా పెంచామన్నారు. ఇప్పటికే 33 జిల్లాల్లో పోలీసులకు ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వల్ల చాలామందికి విధులపై పూర్తిస్థాయి అవగాహన వచ్చిందన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. విధుల్లోకి 75 కంపెనీల కేంద్ర బలగాలు.. రాష్ట్రంలో 54 వేల మంది పోలీసులకు అదనంగా కేంద్రం 145 కంపెనీల పోలీసు బలగాలను ఇచ్చేం దుకు సుముఖత వ్యక్తం చేసిందని, వారం రోజులుగా 75 కంపెనీల బలగాలు ఎన్నికల విధుల్లో చేరిపోయాయని అదనపు డీజీ జితేంద్ర తెలిపారు. ఇప్పటికే సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని అవసరాలకు అనుగుణంగా బలగాలను మోహరిస్తున్నామన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ చేపట్టామన్నారు. ఎన్నికల నాటికి మిగిలిన కంపెనీల బలగాలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అక్రమాలను అడ్డుకునేందుకు 405 ఫ్లయిం గ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ బృందాలు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.7.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11 వేలకు పైగా లైసెన్స్డ్ ఆయుధాలున్నాయని, వీటిలో ఇప్పటివరకు 8 వేలకు పైగా ఆయుధాలను సరెండర్ చేశారని చెప్పారు. -
‘బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సమర్ధవంతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉందని ఏపీ శాంతి భద్రతల అదనపు డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడిన ఆయన పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో నగదు ప్రభావం ఉండే 116 నియోజకవర్గాలను గుర్తించామని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామన్న ఆయన.. సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, అందుకోసం ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 1.06 లక్షల మంది పోలీసులు, 392 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 45 కంపెనీల ఏపీఎస్పీ ఫోర్స్‌లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్వ్కాడ్లలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారులు ఉంటారని రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు. -
పులుల సంరక్షణకు ప్రత్యేక బలగాలు
- అటవీ శాఖ ప్రతిపాదనలకు ఎన్టీసీఏ ఆమోదం - పోలీసులు, పారా మిలిటరీ తరహాలో శిక్షణ సాక్షి, హైదరాబాద్: పులులను సంరక్షించేందుకు ప్రత్యేక బలగాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అటవీ శాఖ పంపిన ప్రతిపాదనలకు జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ- ప్రాజెక్టు టైగర్) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 9 అభయారణ్యాలకు గాను, పులుల ఉనికిని గుర్తించిన 2 అభయారణ్యాలను టైగర్ రిజర్వుగా ప్రకటించారు. వీటిలో ఒకటి దేశంలోనే అతి పెద్దదైన అమ్రాబాద్ టైగర్ రిజర్వు (3,568 చదరపు కిలోమీటర్లు)కాగా, మరొకటి కవ్వాల్ టైగర్ రిజర్వు (892.23 చదరపు కిలోమీటర్లు). టైగర్ రిజర్వు విస్తీర్ణాన్ని కోర్, బఫర్ ఏరియాలుగా వర్గీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కోర్ ఏరియాకు ఫీల్డ్ డెరైక్టర్‌ను నియమించి బఫర్ ఏరియాను కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పరిధిలో చేర్చారు. పులుల సంరక్షణలో కీలకమైన కోర్ ఏరియాలో నూతనంగా నియమించే ప్రత్యేక బలగాలను మోహరిస్తారు. ఒక్కో టైగర్ రిజర్వుకు 120 మంది చొప్పున 240 మంది సిబ్బందిని నియమిస్తారు. ప్రస్తుతం అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది 40-50 ఏళ్ల మధ్య వయసు వారు ఉండడంతో శారీరక దృఢత్వం లేక స్మగ్లర్లు, వన్యప్రాణి వేటగాళ్ల నియంత్రణలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో టైగర్ రిజర్వులో పనిచేసే బలగాల్లో ఆయుధాల వినియోగంలో సుశిక్షితులైన 40 ఏళ్ల లోపు వారినే నియమిస్తారు. -
ఏఓబీలో ముమ్మరంగా గాలింపు
కొమరాడ: ఏఓబీలో ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపుచర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. గురువారం ఆయన కొమరాడ పోలీసుస్టేషన్‌ను అకస్మికంగా పరిశీలించారు. ముందుగా స్టేషన్లో రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఓబీలో అప్రమత్తంగా ఉంటూ గాలింపుచర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ పోలీసు స్టేషన్వద్ద ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఏఓబీలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. కార్యక్రమంలో ఆయనతోపాటు సీఐ బి. వెంకట్రావు, ఎస్సై ధర్మేంద్ర, సిబ్బంది ఉన్నారు. -
పోలీసులు రెడీ
‘మావోయిస్టులతో మరో యుద్ధం మొదలైంది’..కొద్ది రోజుల క్రితం జిల్లా పోలీసులు చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక బలగాలు విశాఖలో అడుగుపెట్టాయి. మాక్ డ్రిల్ పేరుతో నాలుగు రోజులుగా మకాం వేశాయి. మంగళవారం నుంచి ఏజెన్సీలో పీఎల్‌జీఏవారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం భారీ సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరంలో ఉన్న 250 మంది ఎన్ఎస్జీ, ఆక్టోపస్ బలగాలను వినియోగించుకోవాలని చూస్తోంది. నిజానికి మావోలపై యుద్ధానికే ఇంత మందిని రంగంలోకి దింపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం నాటి ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు. వారోత్సవాలను అడ్డుకుంటామని ఓఎస్డీ విశాల్‌గున్ని ప్రకటించారు. సాక్షి, విశాఖపట్నం: వీరవరంలో కొద్ది రోజుల క్రితం మావోయిస్టులను గిరిజనులు హతమార్చడంతో మొదలైన అలజడి క్షణ క్షణం భయాన్ని సృష్టిస్తూనే ఉంది. ఆ సంఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని, కారకులను ప్రజాకోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరికలు చేయడంలో గిరిజనులు కలవరపడుతున్నారు. ఇదే అదునుగా పోలీసులు పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. గిరిజనులు, మావోయిస్టుల మధ్య ఏర్పడిన అంతరాన్ని పెద్దది చేసి శాశ్వతంగా వారి బంధాన్ని తెంచాలని ప్రమత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన దళసభ్యులు పోలీసులపై ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులే కొందరు గూండాలతో తమ వారిని హత్య చేయించారని,గిరిజనులతో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేస్తున్నారని, అయినా తాము భయపడేది లేదని లేఖల ద్వారా స్పష్టం చేశారు. జిల్లాలో ఓ వైపు పోలీసులు, గిరిజనులు, మావోయిస్టుల మధ్య పరస్పర యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు విశాఖ నగరానికి ఈ నెల 27న ఎన్ఎస్జీ, ఆక్టోపస్ పోలీసులు 250మంది చేరుకున్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు గోప్యంగా ఉంచాయి. అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు దాడులకు తెగబడితే ఏ విధంగా ఎదుర్కొవాలనేదానిపై విశాఖలో మాక్‌డ్రిల్ నిర్వహించడానికి వచ్చారని అధికారులు చెబుతున్నారు. దీనిపై సోమవారం ఓ హోటల్లో ఎన్ఎస్జి మేజర్ సూరజ్, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ చిట్టిబాబులు జిల్లా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించారు. 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుండటంతో అత్యవసరమైతే అందుబాటులో ఉండేలా ఇంతమంది సిబ్బందిని జిల్లాకు రప్పించారని సమాచారం. ప్రత్యేక వాహనాలు, ట్రక్కులు కూడా వీరికి అందుబాటులో ఉంచారు. మావోయిస్టుల వారోత్సవాలు, పోలీసుల మాక్‌డ్రిల్‌తో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం మావోయిస్టులు దాడి చేసి పోలీసులను మట్టుబెట్టడంతో మరింత అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున బలగాలను మన్యానికి తరలిస్తున్నట్టు ఓఎస్డీ విశాల్‌గున్ని ‘సాక్షి’కి తెలిపారు. -
సరిహద్దుల్లో రెడ్ అలెర్ట్
=గిరిజనుల్లో తీవ్ర భయాందోళనలు =రంగంలోకి ప్రత్యేక బలగాలు సీలేరు, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మూడు రోజులుగా ఏవోబీలో ఊచకోతకు మావోయిస్టులు తెగబడటంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సరిహద్దు అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మారుమూల గూడేల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దళసభ్యులు పది రోజులుగా హత్యలు, విధ్వంసాలకు పాల్పడటంతో ఆంధ్ర, ఒడిశా, తూర్పుగోదావరి సరిహద్దుల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం మళ్లీ మరికొన్ని ప్రత్యేక బలగాలు రంగంలోకి దింపి అడవులను జల్లెడ పడుతున్నట్టు తాజా సమాచారం. ఒక్కరోజే ముగ్గురు పోలీసు ఇన్ఫార్మర్లను మావోయిస్టులు కాల్చి చంపడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం చోటుచేసుకుంది. కాగా మావోయిస్టులు కూడా గ్రామ సమీపాల్లో పాగా వేసి పోలీస్ ఇన్ఫార్మర్లు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈనేపథ్యంలో కొందరు మైదాన ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.