సరిహద్దుల్లో రెడ్ అలెర్ట్
=గిరిజనుల్లో తీవ్ర భయాందోళనలు
=రంగంలోకి ప్రత్యేక బలగాలు
సీలేరు, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మూడు రోజులుగా ఏవోబీలో ఊచకోతకు మావోయిస్టులు తెగబడటంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సరిహద్దు అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మారుమూల గూడేల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దళసభ్యులు పది రోజులుగా హత్యలు, విధ్వంసాలకు పాల్పడటంతో ఆంధ్ర, ఒడిశా, తూర్పుగోదావరి సరిహద్దుల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
శనివారం మళ్లీ మరికొన్ని ప్రత్యేక బలగాలు రంగంలోకి దింపి అడవులను జల్లెడ పడుతున్నట్టు తాజా సమాచారం. ఒక్కరోజే ముగ్గురు పోలీసు ఇన్ఫార్మర్లను మావోయిస్టులు కాల్చి చంపడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం చోటుచేసుకుంది. కాగా మావోయిస్టులు కూడా గ్రామ సమీపాల్లో పాగా వేసి పోలీస్ ఇన్ఫార్మర్లు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈనేపథ్యంలో కొందరు మైదాన ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.