పోలీసులు రెడీ | Special Forces Reday for Maoist areas | Sakshi
Sakshi News home page

పోలీసులు రెడీ

Published Tue, Dec 2 2014 3:05 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

పోలీసులు  రెడీ - Sakshi

పోలీసులు రెడీ

 ‘మావోయిస్టులతో మరో యుద్ధం మొదలైంది’..కొద్ది రోజుల క్రితం జిల్లా పోలీసులు చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక బలగాలు విశాఖలో అడుగుపెట్టాయి. మాక్ డ్రిల్ పేరుతో నాలుగు రోజులుగా మకాం వేశాయి. మంగళవారం నుంచి ఏజెన్సీలో పీఎల్‌జీఏవారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం భారీ సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరంలో ఉన్న 250 మంది ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్ బలగాలను వినియోగించుకోవాలని చూస్తోంది. నిజానికి మావోలపై యుద్ధానికే ఇంత మందిని రంగంలోకి దింపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం నాటి ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు. వారోత్సవాలను అడ్డుకుంటామని ఓఎస్డీ విశాల్‌గున్ని ప్రకటించారు.
 
 సాక్షి, విశాఖపట్నం: వీరవరంలో కొద్ది రోజుల క్రితం మావోయిస్టులను గిరిజనులు హతమార్చడంతో మొదలైన అలజడి క్షణ క్షణం భయాన్ని సృష్టిస్తూనే ఉంది. ఆ సంఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని, కారకులను ప్రజాకోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరికలు చేయడంలో గిరిజనులు కలవరపడుతున్నారు. ఇదే అదునుగా పోలీసులు పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. గిరిజనులు, మావోయిస్టుల మధ్య ఏర్పడిన అంతరాన్ని పెద్దది చేసి శాశ్వతంగా వారి బంధాన్ని తెంచాలని ప్రమత్నిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన దళసభ్యులు పోలీసులపై ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులే కొందరు గూండాలతో తమ వారిని హత్య చేయించారని,గిరిజనులతో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేస్తున్నారని, అయినా తాము భయపడేది లేదని లేఖల ద్వారా స్పష్టం చేశారు.
 
 జిల్లాలో ఓ వైపు పోలీసులు, గిరిజనులు, మావోయిస్టుల మధ్య పరస్పర యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు విశాఖ నగరానికి ఈ నెల 27న  ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్ పోలీసులు 250మంది చేరుకున్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు గోప్యంగా ఉంచాయి. అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు దాడులకు తెగబడితే ఏ విధంగా ఎదుర్కొవాలనేదానిపై విశాఖలో మాక్‌డ్రిల్ నిర్వహించడానికి వచ్చారని అధికారులు చెబుతున్నారు. దీనిపై సోమవారం ఓ హోటల్‌లో ఎన్‌ఎస్‌జి మేజర్ సూరజ్, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ చిట్టిబాబులు జిల్లా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం బీచ్ రోడ్డులోని ఓ హోటల్‌లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించారు.
 
 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుండటంతో అత్యవసరమైతే అందుబాటులో ఉండేలా ఇంతమంది సిబ్బందిని జిల్లాకు రప్పించారని సమాచారం. ప్రత్యేక వాహనాలు, ట్రక్కులు కూడా వీరికి అందుబాటులో ఉంచారు. మావోయిస్టుల వారోత్సవాలు, పోలీసుల మాక్‌డ్రిల్‌తో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం మావోయిస్టులు దాడి చేసి పోలీసులను మట్టుబెట్టడంతో మరింత అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున బలగాలను మన్యానికి తరలిస్తున్నట్టు ఓఎస్డీ విశాల్‌గున్ని ‘సాక్షి’కి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement