కరోనాను జయించాడు.. | Adilabad Corona First Patient Discharge From Gandhi Hospital | Sakshi
Sakshi News home page

కరోనాను జయించాడు..

Published Fri, May 1 2020 12:05 PM | Last Updated on Fri, May 1 2020 12:05 PM

Adilabad Corona First Patient Discharge From Gandhi Hospital - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో కరోనా వైరస్‌ సోకిన మొట్టమొదటి ఉట్నూర్‌ మండలం హస్నాపూర్‌కు చెందిన వ్యక్తి గాంధీ ఆస్పత్రి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యాడు. మర్కజ్‌ నుంచి తిరిగివచ్చిన 76 మందిని అప్పట్లో గుర్తించారు. వారందరి స్వాబ్‌ నమూనాలను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించగా, హస్నాపూర్‌కు చెందిన వ్యక్తికి ఏప్రిల్‌ 4న కరోనా వైరస్‌ పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఆ మరుసటి రోజే మర్కజ్‌ రిటర్న్‌ వ్యక్తుల్లో మరో తొమ్మిది మందికి పాజిటివ్‌ రావడంతో కలకలం రేగింది. ఇలా ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వారిలో పది మందికి కరోనా వైరస్‌ సోకగా, ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తొమ్మిది మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆదిలాబాద్‌కు చెందిన మరొకరు మాత్రమే గాంధీ ఆస్పత్రిలో ఉన్నారు. అయితే వీరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి మరో 11 మందికి వైరస్‌ సోకి ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అందులో ఐదేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే మర్కజ్‌ రిటర్న్‌లో పాజిటివ్‌ వచ్చిన వారిలో బుధవారం డిశ్చార్జ్‌ అయిన హస్నాపూర్‌కు చెందిన పాతికేళ్ల వ్యక్తే అతిచిన్న వయస్సు కలిగిన వాడు.

ఇదీ పరిస్థితి..
జిల్లాలో 21 మందికి కరోనా వైరస్‌ సోకగా, అందులో నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది కోలుకున్నారు. ఏప్రిల్‌ 16న ఒకరు, 17న నలు గురు, 24న ఒకరు, 25న ఇద్దరు, 29న ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్‌ పట్టణం, ఉట్నూర్‌ మండలం, నేరడిగొండ మండలాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో నేరడిగొండ నుంచి ముగ్గురు, ప్రస్తుతం ఉట్నూర్‌ మండలం ఒకరు రికవరీ కావడంతో ఈ రెండు మండలాలు ప్రస్తుతం ఫ్రీజోన్‌లోకి వెళ్లిపోయాయి. ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన మరో 11 మంది ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

భరోసానే కాపాడింది..
జిల్లాలో కరోనా వైరస్‌ సోకిన మొదటి వ్యక్తిని నేనే. నన్ను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడు చాలా భయం వేసింది. అయితే కొంతమంది నాకు అండగా నిలిచి భరోసానిచ్చారు. అదే ఈరోజు నన్ను కాపాడింది. అప్పట్లో ఢిల్లీ వెళ్లివచ్చాను. నిజామొద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లివచ్చిన తర్వాత హస్నాపూర్‌ నుంచి ఆదిలాబాద్‌కు ఏప్రిల్‌ 1న తీసుకెళ్లారు. స్వాబ్‌ నమూనాలను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. ఏప్రిల్‌ 4వ తేదీన నాకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి షిఫ్ట్‌ చేశారు. అక్కడ డాక్టర్లు మంచి చికిత్స అందించారు. అనంతరం రెండుసార్లు నెగిటివ్‌ రిపోర్టు రావడంతో నన్ను బుధవారం డిశ్చార్జ్‌ చేశారు. మే 21వ తేదీ వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్లు సూచించారు. కరోనా వైరస్‌ సోకిన వారు భయపడకుండా చికిత్స తీసుకుంటే నయం అవుతుంది.– కరోనా బాధితుడు, హస్నాపూర్‌ గ్రామం, ఉట్నూర్‌ మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement