పైసా వసూల్‌!  | Adilabad education office is become corrupted | Sakshi
Sakshi News home page

పైసా వసూల్‌! 

Published Mon, Feb 26 2018 5:05 PM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM

Adilabad education office is become corrupted - Sakshi

నెల క్రితం జిల్లాలోని ఓ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందింది. అయితే విద్యాశాఖ కార్యాలయానికి చెందిన కొందరు శవాలపై పైసలెరుకునే చందంగా కేజీబీవీ ఉద్యోగుల నుంచి రూ.20 వేలు వసూలు చేసినట్లు సమాచారం.

 ప్రైవేట్‌ పాఠశాలల అనుమతి కోసం కొంతమంది సెక్షన్‌ అధికారులు పైసలు ఇవ్వందే ఫైలు కదిలించడం లేదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. కాసులిస్తే వసతులు లేకున్నా అనుమతి ఇట్టే ఇస్తున్నట్లు విమర్శలున్నాయి. 
 
ఆర్‌ఎంఎస్‌ఏ ఆడిట్‌ జరిగినప్పుడు కొంత మంది ప్రధానోపాధ్యాయులు యూసీలు సరిగా లేకపోవడంతో విద్యాశాఖ కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులు పలువురు హెచ్‌ఎంల నుంచి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. 

విద్యాశాఖలో అవినీతి తంతుకు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. 
   
ఆదిలాబాద్‌టౌన్‌ : వేల రూపాయల్లో వేతనాలు.. అనుకూల పనివేళలు.. నిలకడ కలిగిన ఉద్యోగం.. అయినా అక్రమార్జనపై ఆశ.. లంచాలు ఇవ్వందే విద్యా శాఖలో పనులు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. డబ్బు చూపిస్తే తప్పా కొందరు ఉద్యోగుల్లో చిరునవ్వు కానరావడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. విద్యాభివృద్ధికి సహకరించాల్సిన కొంతమంది కార్యాలయ ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడి విధులను దుర్వినియోగపర్చుతున్నారనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఒప్పంద ఉద్యోగుల జీతాలు, బిల్లులు, ప్రైవేట్‌ పాఠశాలల అనుమతులు.. ఇలా దేనిని వదలకుండా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని కార్యాలయ ఉద్యోగులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రెగ్యులర్‌ డీఈవో లేకపోవడంతో కొంతమంది ఉద్యోగులు ఆడిందే ఆటగా కొనసాగుతోంది. వారం క్రితం పాఠశాల విద్యాశాఖ రెగ్యులర్‌ డీఈవోగా జనార్దన్‌రావు నియమించినా ఆయన ఇంకా విధుల్లో చేరలేదు. ఆయన జిల్లాకు రావడానికి అనాసక్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రతి పనికి ధరను నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతుండడంతో విద్యా శాఖ కార్యాలయం అంటే నే విరక్తి కలుగుతుందని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు.  

కాసులిస్తేనే అనుమతి.. 

నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలలకు స్థలం, విశాలమైన తరగతి గదులు, మైదానం, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, విద్యార్హతలున్న ఉపాధ్యాయులు, నీటి సదుపాయం, ఫైర్‌ అనుమతి, తదితర సౌకర్యాలు ఉండాలి. కానీ జిల్లాలో చాలా వరకు ఎలాంటి సౌకర్యాలు లేని పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇప్పటివరకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పరిశీలనకు వెళ్లినప్పుడు అందినకాడికి దండుకొని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలల పరిస్థితి కూడా అలాగే ఉంది. కిందిస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ‘మామూలు’ తీసుకోవడంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల రెన్యువల్‌కు సంబంధించి వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రైవే ట్‌ పాఠశాలలు అదనపు సెక్షన్‌లు, ఎల్‌కేజీ, యూకేజీలకు కూడా అనుమతులు తీసుకోవా ల్సి ఉంటుంది. కానీ చాలా పాఠశాలల్లో ఎలాం టి అనుతులు లేకుండానే కొనసాగిస్తున్నారు. కొంతమంది విద్యాశాఖ ఉద్యోగులు వారికి ఫోన్‌ చేసి, పాఠశాలలకు తిరుగుతూ వసూలు చేసుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. విద్యాశాఖ ఉద్యోగులతో పాటు కొం తమంది ఎంఈవోల తీరు కూడా అలాగే ఉం ది. మారుమూల గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు ఎగనామం పెడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి నెలకు ఎంతోకొంత డబ్బులు తీసుకుంటూ, విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారు. నెల క్రితం ఓ కేజీబీవీలో విద్యార్థిని అనార్యోగంతో మృతి చెందితే కేజీబీవీ ఉద్యోగి నుంచి కొంత మంది ఉద్యోగులు రూ.20వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఇంత జరగుతున్నా పట్టించుకునేవారు లేక విద్యాశాఖ అవినీతికి నిలయంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.

 సమయ పాలనేదీ?

 జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఇష్టమొచ్చినప్పుడు రావడం, నిర్దేశిత సమయానికి ముందే ఇంటిముఖం పట్టడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ పనుల కోసం వచ్చేవారికి ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లిన వారు మూడు గంటలు దాటితేకానీ కార్యాలయం ముఖం చూడరు. సాయంత్రం 5 అయ్యిందంటే కార్యాలయంలో ఉండని పరిస్థితి. 

కొత్త డీఈవో విధుల్లో చేరితేనే గాడిలో.. 

ప్రస్తుతం ఇన్‌చార్జి డీఈవోగా కార్యాలయ ఏడీ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్‌ డీఈవో పదోన్నతిపై వెళ్లడంతో కొన్ని నెలలుగా పోస్టు ఖాళీగా ఉంది. అలాగే డెప్యూ టీ ఈవో, ఒక్కరు కూడా రెగ్యులర్‌ ఎంఈవో లు లేకపోవడంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోందనే విమర్శలున్నాయి. వారం క్రితం నాగర్‌కర్నూల్‌లో విధులు నిర్వహిస్తున్న జనార్దన్‌రావుకు డీఈవోగా పదోన్నతి కల్పిస్తూ ఆదిలాబాద్‌కు బదిలీ చేసింది. ఆయన ఇంకా విధుల్లో చేరలేదు. రెగ్యులర్‌ డీఈవో లేని ప్రభావం పదో తరగతి ఫలితాలపై పడే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. 

అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి

విద్యాశాఖ కార్యాలయం లో అక్రమాలు పెరిగిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఆయా సెక్షన్ల ఉద్యోగులు పాతుకుపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతోంది. దీర్ఘకాలికంగా పని చేస్తున్న వారి సెక్షన్లు మార్చాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, కేజీబీవీల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై గతంలో ఇన్‌చార్జి డీఈవో రవికాంత్‌రావు దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదు. కొత్త డీఈవో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.  
వృకోధర్, డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి 

నా దృష్టికి రాలేదు 

విద్యాశాఖ కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. పని కోసం ఎవరైనా డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు సమయపాలన పాటించాలి. విధులను విస్మరిస్తే చర్యలు తప్పవు. 
కిశోర్‌సింగ్, ఇన్‌చార్జి డీఈవో, ఆదిలాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement