ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఒకటవ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి రాధాకృష్ణ మూర్తిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం ఎక్సైజ్ పోలీసులు గాంధీనగర్‌లో అరెస్ట్ చేసిన ఓ బాధితుడికి బెయిల్ మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేశాడని రాధాకృష్ణ మూర్తిపై ఆరోపణలు వచ్చాయి.
దీనిపై హైకోర్టులో బాధితుడి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. జడ్జి రాధా కృష్ణపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచి రాధాకృష్ణ మూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ విషయం గురించి ఏసీబీ డెప్యూటీ డైరెక్టర్ రమణ కుమార్ స్పందిస్తూ.. ‘ఒక బెయిల్ విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్ట్ ఆదేశాలతో జడ్జి రాధాకృష్ణ మూర్తి ఇంట్లో సోదాలు చేస్తున్నాం. డ్రగ్స్ కేసులో ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వడం కోసం డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణ ఉంది. ఆల్వాల్‌తో పాటు మరో రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రాధా కృష్ణ మూర్తి ఇంటితో పాటు మరో ఇద్దరు న్యాయవాదుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఆస్తులను గుర్తించాం కానీ అవి సక్రమమా కాదా అనేది దర్యాప్తులో తేలాలి. బ్యాంక్ లాకర్, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు లభించాయి. ఈ ఒక్క కేసులోనే కోర్ట్ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహిస్తున్నాం’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment