‘గళం’ విప్పేదెవరో..! | Adilabad MLC Elections | Sakshi
Sakshi News home page

‘గళం’ విప్పేదెవరో..!

Published Fri, Mar 15 2019 2:56 PM | Last Updated on Fri, Mar 15 2019 2:58 PM

Adilabad MLC Elections - Sakshi

సాక్షి, మంచిర్యాల:  శాసనమండలిలో గళం విప్పేందుకు ఉబలాటపడుతున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోలింగ్‌కు కేవలం వారం రోజులే వ్యవధి ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓట్ల వేటను వేగవంతం చేశారు. సాధారణ ఓటర్లకు భిన్నంగా పట్టభద్రుల ఓటర్లను దొరకపట్టడమే గగనమవుతున్న తరుణంలో అన్ని రకాల ప్రచారాస్త్రాలను వినియోగించుకొంటున్నారు.

 
ప్రచారం ముమ్మరం
శాసనమండలి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా పట్టభద్రుల నియో జకవర్గ స్థానానికి తలపడుతున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ఆలోగా వీలైనంతమంది ఓటర్లను కలుసుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు. సాధారణ ఎన్నికల్లోనైతే ఓటర్లంతా ఒక గ్రామంలోనో, పట్టణంలోనో ఉంటారు. కాని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎక్కడుంటారో దొరకబట్టడమే అభ్యర్థులకు కష్టంగా మారింది.

దీంతో ఓట్ల సమూహాలను గుర్తించేందుకు అభ్యర్థుల మద్దతుదారులు నానాతిప్పలు పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలల కరస్పాండెంట్లు, విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదుల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రధానంగా నలుగురు అభ్యర్థుల నడుమ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ వేత్త టి.జీవన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ నేత పి.సుగుణాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ మద్దతుతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ పోటీలో ఉన్నారు.

వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ  నెల 22వ తేదీన ఎమ్మెల్సీ పోలింగ్‌ ఉండడంతో, అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగిరం చేశారు. ఇప్పటికే ఓ మారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రచారం పూర్తి చేసిన అభ్యర్థులు, రెండవసారి ప్రచారం చేపట్టారు. గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి మంచిర్యాలలో ప్రచారం నిర్వహించారు. ముందుగా మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

అక్కడి నుంచి కోర్టుకు వెళ్లి న్యాయవాదుల మద్దతు కోరారు. స్వతహాగా న్యాయవాది అయిన జీవన్‌రెడ్డికి లాయర్లు స్వాగతం పలికారు. అనంతరం విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతు కోసం తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలంటూ అభ్యర్థించారు. కాగా మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ ఈ నెల 13న నిర్మల్‌లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి పి.సుగుణాకర్‌రావు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో ఇప్పటికే ప్రచారం చేపట్టారు.

పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులంతా మండలిలో తమకు గళం విప్పే అవకాశం ఇవ్వాలంటూ ఓటు అభ్యర్థిస్తున్నారు. పట్టభద్రుల వాణిని మండలిలో వినిపించేందుకు తమకు పట్టం కట్టాలంటూ కోరుతున్నారు. ముఖ్యంగా సీనియర్‌ రాజకీయ వేత్త, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించే గొంతు కోసం తనకు ఓటేయాలంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతోపాటు తనకున్న వ్యక్తిగత చరిష్మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందనే భరోసాతో ఆయనున్నారు. అంతా అధికారపక్షంగా ఉన్న సమయంలో మాట్లాడే ఓ ప్రతిపక్ష గొంతు కావాలంటూ ప్రచారాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

ఇక టీఆర్‌ఎస్‌ మద్దతుతో బరిలో ఉన్న చంద్రశేఖర్‌గౌడ్, సైతం పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు తనకు చాన్స్‌ ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన తనకు అన్ని అంశాలపై అవగాహన ఉందంటున్నారు. బీజేపీ జాతీయ నేత  పి.సుగుణాకర్‌రావు సైతం మండలిలో ప్రశ్నించే గొంతుకు అవకాశం కల్పించాలని కోరారు. రాణి రుద్రమ యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొన్నారు. మొత్తానికి మండలి పోలింగ్‌కు కేవలం వారం రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement