నిర్వాసితులపై ప్రభుత్వ వైఖరి సరిచేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ వైఖరి సరిచేసుకోవాలని, ప్రాజెక్టుల కోసం త్యాగాలు చేస్తున్న ప్రజల పట్ల దబారుుంపులకు స్వస్తి పలకాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హితవు పలికారు. ప్రభుత్వం బెదిరించి, అదిరించి, జైల్లో పెట్టి ఏమీ సాధించలేదని స్పష్టం చేశారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నిర్వాసితుల సదస్సు సందర్భంగా టీజేఏసీ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్న భూసేకరణను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఈ డిక్లరేషన్ స్పష్టం చేసింది.
ఇదే డిమాండ్లపై రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలంగాణలో ప్రతి ఇంటి నుంచి ప్రజలు హాజరవ్వాలని సదస్సు పిలుపునిచ్చింది. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతోనో, మరో పేరుతోనో ప్రభుత్వ భూ సేకరణ కారణంగా నిర్వాసితులవుతున్న ప్రజల అభిప్రాయ సేకరణకు ఉద్దేశించిన ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు కోల్పోరుున బాధితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజేఏసీ విడుదల చేసిన డిక్లరేషన్.. మల్లన్నసాగర్, ఓపెన్ కాస్ట్ గనులు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణ క్రమంలో నిర్వాసితులవుతున్న ప్రజలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ముందుగానే ప్రకటించి, ప్రజామోదం పొందిన తరువాతనే యథాతథంగా అమలు పరచాలని డిమాండ్ చేసింది. ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనం ఉండాలని సదస్సు అభిప్రాయపడింది.
నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి
క్షేత్రస్థారుులో పరిశీలనకు సాంకేతిక నిపుణులు, సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. ఈ కమిటీ నివేదిక ఆమోదం పొందేవరకూ ఆ ప్రాజెక్టు కోసం భూ సేకరణను ఆపివేయాలని కోరింది. సంపూర్ణ ప్రాజెక్టు నివేదిక(డి.పి.ఆర్.) ప్రకటించకుండానే, అవసరాలకు మించి చేస్తున్న భూసేకరణ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
నిర్వాసితులకు ప్రాజెక్టు లాభాల్లో వాటా
భూ సేకరణ విషయంలో ఉన్న శ్రద్ధ నష్టపరిహారం విషయంలో లేకపోవడం పట్ల సదస్సు నిరసన తెలిపింది. పునరావాసం, ఉపాధి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. రాష్ట్రం లో భూములను త్యాగాలు చేసిన నిర్వాసితులకు ప్రాజెక్టు ద్వారా అందుతున్న లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ‘‘భూమికి భూమి’’ప్రాతిపదికన నిష్పత్తి దామాషా లో సాగుభూములను అదే ప్రాజెక్టు కింద ఇవ్వాలని డిమాండ్ చేసింది. జాతీయ భూసేకరణ చట్టం- 2013 ప్రకారమే నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసింది.