కల్తీ ఆయిల్ గుట్టురట్టు | Adulterated oil busting | Sakshi
Sakshi News home page

కల్తీ ఆయిల్ గుట్టురట్టు

Published Thu, Dec 3 2015 12:36 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కల్తీ ఆయిల్ గుట్టురట్టు - Sakshi

కల్తీ ఆయిల్ గుట్టురట్టు

 జంతు, కోళ్ల వ్యర్థాలతో తయారీ
 పూడూరు మండలం గొంగుపల్లిలో
 వెలుగుచూసిన ఘటన    స్థావరంపై పోలీసుల దాడి
1200 లీటర్ల ఆయిల్‌స్వాధీనం
జంతు, కోళ్ల వ్యర్థాలతో తయారీ  
పూడూరు మండలం గొంగుపల్లిలో
 వెలుగుచూసిన ఘటన
 పూడూరు:
జంతు, కోళ్ల వ్యర్థాలతో ఆయిల్ తయారు చేస్తున్న ఓ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 1200 లీటర్ల కల్తీ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన  మండల పరిధిలోని గొంగుపల్లి శివారులో బుధవారం వెలుగుచూసింది. చేవెళ్ల సీఐ ఉపేందర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొంగుపల్లి గ్రామానికి చెందిన 143 సర్వేనంబర్‌లో కొంత భూమిని ప్రభుత్వం గతంలో అదే గ్రామానికి చెందిన పర్మయ్యకు ఇచ్చింది. ఈభూమిని నగరంలోని మెహిదీపట్నంకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ లీజుకు తీసుకొని ఓ షెడ్‌ను  నిర్మించుకున్నాడు.
 
  కొంతకాలంగా అందులో పశు, కోళ్ల వ్యర్థాలతో కల్తీ ఆయిల్‌ను గుట్టుగా తయారు చేస్తున్నాడు. దీంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. బుధవారం సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో చన్గోముల్ ఎస్‌ఐ శేఖర్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఓ పెద్ద బాణలో జంతు, కోళ్ల వ్యర్థాలను మరిగిస్తూ నూనె తయారు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అక్కడ పని చేస్తున్న అన్వర్, షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షెడ్ యజమాని ఇర్ఫాన్ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు. 1200 లీటర్ల కల్తీ ఆయిల్, 8 డ్రమ్ముల పశువుల వ్యర్ధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న కేంద్రాన్ని సీజ్ చేశారు. స్థానిక వీఆర్‌ఓ రాంచందర్‌రావు  ఫిర్యాదు మేరకు కల్తీ ఆయిల్ తయారీలో ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.  
 
 ఔషధాలలో ముడి సరుకుగా...
 జంతు వ్యర్థాలతో తయారు చేసిన ఈ కల్తీ ఆయిల్‌ను జౌషదాల తయారీలో ముడి సరుకుగా ఉపయోగిస్తారని, ఈక్రమంలో ఫార్మా కంపెనీలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ నూనె తయారీకి అవసరమయ్యే కొన్ని పదార్థాలను షోలాపూర్ నుంచి ఉసా చాచా అనే వ్యాపారి సమకూరుస్తాడని కల్తీ అయిల్ తయారీ కేంద్రంలో పని చేసే బిహార్‌కు చెందిన అన్వర్, షకీల్‌లు తెలిపారు.  
 
 అంతా అధికారులకు తెలుసు..?
 చాలా రోజులుగా ఈ కల్తీ దందా సాగుతోంది. ఈ విషయం రెవెన్యూ, పంచాయతీ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. పొలాల మధ్య నిర్వహిస్తున్న ఈ దందాలో అధికారులు అడ్డుకోకుండా నిర్వాహకులు పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.   
 
 క్రిమినల్ కేసు నమోదు: సీఐ ఉపేందర్
 కల్తీ ఆయిల్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశాం. నిర్వాహకుడు ఇర్ఫాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. ప్రజలకు హానీ కలిగించే ఇలాంటి కేంద్రాలపై చర్యలు తీసుకుంటాం. 1200 లీటర్ల కల్తీ ఆయిల్, పశు, కోళ్ల వ్యర్ధాలు ఉన్న డబ్బాలను స్వాధీనం చేసుకున్నాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement