వంట నూనెల కల్తీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. జిల్లాకు చెందిన మంచి (పల్లీ) నూనె వ్యాపారులు చేస్తున్న కల్తీ దందా నిజమని అధికారులు చేసిన దాడుల్లో తేలింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి తదితర పట్టణాల్లో ఆయిల్ హోల్ సేల్ వ్యాపారం నిర్వహిస్తూ వినియోగదారులకు కుచ్చుటోíపీ పెడుతున్నారు. పేరుకు తమ బ్రాండ్‌పై వేరు శనగ ఉన్నట్లు క్యాన్లు, ప్యాకెట్ల పైన ముద్రించి మోసానికి పాల్పడుతున్నారు. జిల్లాలో కల్తీ నూనె విక్రయిస్తూ కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల నామ మాత్రపు తనిఖీలతో ఆయిల్ మిల్లర్లు, వ్యాపారులు తమ దందా బయట పడకుండా గుట్టుగా సాగిస్తున్నారు.
నల్లగొండ టూటౌన్ : జిల్లాలో కల్తీ ఆయిల్ విక్రయిస్తున్నారని అప్పట్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు నల్లగొండ, హాలియా, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ పట్టణాల్లో సంబంధిత అధికారులు దాడులు జరిపి శాంపిల్స్ సేకరించారు. ఆయా ప్రాంతాల్లోని మిల్లులు, ట్రేడర్స్‌లో సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపడంతో వ్యాపారుల కల్తీ మాయ బయట పడింది. వ్యాపారులు విక్రయిస్తున్న ఆయిల్‌లో కల్తీ నిజమేనని రిపోర్ట్‌లలో కూడా వచ్చింది. నల్లగొండలోని నెహ్రూగంజ్‌లో ఉన్న ఓ ఆయిల్ మిల్లుపై మూడు కేసులు నమోదు చేశారు. అదే విధంగా హాలియాలో ఉన్న మిల్లు, ట్రేడర్స్‌పైకూడా కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, మిర్యాలగూడ, కొండ మల్లేపల్లిలోని కల్తీ వ్యాపారంపై నివేదిక తయారు చేసి ఫుడ్ ఇన్స్‌పెక్టర్ జాయింట్ కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. సదరు వ్యాపారులపై జాయింట్ కలెక్టర్ జరిమానా విధించాల్సి ఉంటుంది. ఆయిల్ కల్తీ చేసినందుకు ఒక్కో వ్యాపారికి రూ.2 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. కానీ దాదాపు ఏడాది కావస్తున్నా సంబంధిత కల్తీ రిపోర్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.
తక్కువ ధర నూనె కలిపి ...
కాకినాడ నుంచి వివిధ రకాల కంపెనీల నూనెను డ్రమ్ముల్లో జిల్లాకు చెందిన వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. పల్లి నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఇతర తక్కువ ధరలకు లభించే నూనె డ్రమ్ములు ఇక్కడి వ్యాపారులు హోల్ సేల్ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన సగం వేరు శనిగ నూనెను, తక్కువ ధరకు లభించే పత్తి నూనె, సన్‌ఫ్లవర్ నూనెను వాటిలో కలిపి మరో సారి వాటిని మిల్లులో పోస్తారు. ఈ ఆమిల్ అంతా బాగా కలిసి పోయినా తర్వాత ఆ నూనెను సంబంధిత వ్యాపారుల సొంత బ్రాండ్ స్టిక్కర్లు అంటించి ఉన్న క్యాన్లలో ప్యాక్ చేస్తారు. అదే లీటర్ ప్యాకెట్ తయారు చేసి జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న కిరాణా దుకాణాలకు సదరు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు.
వేరు శనిగ నూనె అని..
జిల్లాలోని ఆయిల్ మిల్లుల వ్యాపారులు, హోల్ సేల్‌గా ఆయిల్ తెచ్చి ఇక్కడే ప్యా క్ చేసి విక్రయిస్తున్న కొంత వ్యాపారులు రూ.కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వేరు శనిగ నూనె అని కల్తీ ఆయిల్‌ను వినియోగారులకు అంట కడుతూ నిండా ముంచుతున్నారు. వ్యాపారుల మాయ జాలం అంతా ఇంతా కాదు. ప్రతి రోజు జిల్లాలో కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. అమాయక ప్రజలు తా ము కొంటున్నది కల్తీ నూనె అని తెలియక వ్యాపారుల చేతిలో మోస పోతున్నారు.
కల్తీ అని రిపోర్ట్‌లు వచ్చాయి.
గతంలో తాము సేకరించిన శ్యాంపిల్స్‌లో కల్తీ అని తేలింది. సంబంధిత వ్యాపారుల ఆయిల్ కల్తీపై నివేదిక తయారు చేసి జాయింట్ కలెక్టర్‌కు పంపడం జరిగింది. కల్తీ వ్యాపారులకు జేసీ జరిమానా విధిస్తారు. తప్పు చేస్తే ఎవరికైనా జరిమానా తప్పదు. – ఖలీల్, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment