యాదాద్రిలో అడ్వాన్సు బుకింగ్
తిరుమల తరహాలో సాఫ్ట్‌వేర్ రూపొందించనున్న వైటీడీఏ
► వ్యర్థ జలాల శుద్ధికి భారీ ప్లాంట్
►సీఎం సూచనలతో ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: అడుగడుగునా ఆధ్యాత్మిక భావన కలిగించే నిర్మాణాలు, ఆధునిక హంగుల మేళవింపుతో దేశంలోనే గొప్ప క్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకోనుంది. భవిష్యత్తులో తిరుమల తరహాలో దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దర్శనం విషయంలో ఎవరూ నిరాశ చెందకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా తిరుమల వెంకన్న దర్శన సమయాన్ని కొన్ని రోజుల ముందుగానే బుక్ చేసుకుంటున్న తరహాలోనే యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి దర్శనానికీ అడ్వాన్‌స బుకింగ్‌స వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.
తిరుమలలో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి తదనుగుణంగా సాఫ్ట్‌వేర్ రూపొందించాలని నిర్ణరుుంచారు. అలాగే ఆలయానికి దిగువన 40 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొండపైకి వాహనాలు అనుమతించొద్దని ఇప్పటికే నిర్ణయించినప్పటికీ కొన్ని నిర్మాణాలకు సంబంధించిన సెల్లార్ ప్రాంతంలో వీఐపీల కార్ల పార్కింగ్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెల్లార్ స్థలం ఖాళీగా ఉంటున్నందున అందులో 2 వేల కార్లు పార్క్ చేయగలిగేలా మల్టీలెవల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి దేవాలయానికి చేరుకోవటానికి ప్రత్యేకంగా ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తారు. దిగువన మరో 35 ఎకరాల స్థలాన్ని బస్ డిపో, పోలీసు, ఫైర్‌స్టేషన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టుల కోసం కేటాయించారు.
ఆలయానికి చేరువలో పూలతోట కోసం 25 ఎకరాలు కేటాయించారు. కల్యాణమండపం, ప్రవచన వేదికలు, భారీ సంఖ్యలో భక్తులు కూర్చోవటానికి ఏర్పాట్లు కోసం 50 ఎకరాలు కేటాయించారు. గుట్టపై నుంచి దిగువకు వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేసి వెలుపలికి పంపేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భారీ నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. భక్తుల వసతి కోసం 100 చొప్పున నాన్‌ఏసీ, ఏసీ, ఉచిత గదులను, భారీ డార్మిటరీని నిర్మించనున్నారు. కాటేజీల నిర్మాణం కోసం దాతలు ముందుకొస్తున్నందున ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. మరోవైపు యాదాద్రిలో 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన నేపథ్యంలో భారీ విగ్రహాల తయారీలో ప్రసిద్ధి చెందిన చైనాలో అధికారులు పర్యటించి అక్కడి విగ్రహాల ఏర్పాటును పరిశీలించనున్నారు.