సమగ్ర సర్వేకు ముందస్తు ‘ప్రణాళిక’ | advance 'planning' to comprehensive survey | Sakshi
Sakshi News home page

సమగ్ర సర్వేకు ముందస్తు ‘ప్రణాళిక’

Published Thu, Aug 7 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

advance 'planning' to comprehensive survey

 సిద్దిపేట జోన్: సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటి సర్వే కోసం అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులు కసరత్తు చేశారు. మూడు రోజులుగా పట్టణంలో మాక్ సర్వే చేస్తూ ఇళ్లకు నంబరింగ్ వేశారు. ఈ పద్ధతి సులువుగా ఉండడంతో జిల్లాలోని మిగతా చోట్ల కూడా అధికారులు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు.

 రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శక ఆదేశానుసారం అధికారులు ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. అందులో భాగంగా గత రెండు రోజులుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి  నేతృత్వంలో మెప్మా, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో మాక్ సర్వేను నిర్వహించారు. పట్టణంలోని 34 వార్డుల్లో 25, 517 కుటుంబాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు ఆ దిశగా ఇన్యూమరేటర్ల నియామకాన్ని తాత్కాలికంగా చేపట్టారు.

 ఒక్కొక్కరికి 25 కుటుంబాల చొప్పున గుర్తిస్తూ 19న సర్వే నిర్వహించనున్న క్రమంలో అస్తవ్యస్థంగా ఉన్న సిద్దిపేట పట్టణ ఇంటి నంబర్లను ఒక క్రమబద్ధీకరణలో రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని ఆయా వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది గత రెండు రోజులుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మాక్ సర్వేలో భాగంగా ఇంటి నంబర్‌ను ఆధారంగా చేసుకొని ఆ గృహంలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్యను నంబరింగ్ విధానం ద్వారా గోడలపై రాస్తూ 19న నిర్వహించనున్న సర్వే సులభ తరానికి ప్రణాళికను రూపొందించుకున్నారు.

 అందులో భాగంగానే సిద్దిపేట పట్టణంలో గుర్తించిన 25,517 కుటుంబాలకు భిన్నంగా రెండు రోజుల్లోనే సుమారు 5 కుటుంబాలు ప్రస్తుత స్థితిగతులను బట్టి రికార్డుల్లోకి వచ్చినట్లు సమాచారం. దీన్ని ప్రమాణికంగా చేసుకుని మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన మాక్ సర్వే ఫలితాలను గుర్తించిన జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా జిల్లాలోని మిగతా చోట్ల ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement