నగరంలో అదో మినీ ఆఫ్రికా.. | African People Coming Hyderabad For Education And Business | Sakshi
Sakshi News home page

అదో మినీ ఆఫ్రికా..

Published Fri, Jan 25 2019 10:23 AM | Last Updated on Fri, Jan 25 2019 10:23 AM

African People Coming Hyderabad For Education And Business - Sakshi

ఆరడుగులకుపైగా ఎత్తు.. రింగురింగుల జుత్తు.. బ్లాక్‌ కలర్‌లో భారీ ఆకారం.. వెస్ట్రన్‌ ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్న యువతరం. సరికొత్త స్టైల్‌ వారి సొంతం.. ప్రపంచ చరిత్రలో వారిదో ప్రత్యేక స్థానం. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వీరు కనిపిస్తారు. మన దేశంలోనూ కనిపిస్తారు. అందులో మినీ ఇండియాగా పేరుగాంచిన మన హైదరాబాద్‌లోనూ వారు దర్శనమిస్తారు. నగరంలో వీరికి ఓ ప్రత్యేక కాలనీయే ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. ఇక్కడికి వెళ్లినవారికి ఆఫ్రికా దేశానికి వెళ్లామనే ఫీలింగ్‌ కలగమానదు. వీరు ఇక్కడ అడుగడుగునా కనిపిస్తారు. జూబ్లీహిల్స్‌ను ఆనుకొని ఉన్న పారామౌంట్‌ హిల్‌ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తోంది. నల్లజాతీయుల జీవనశైలి అబ్బురపరుస్తోంది. రకరకాల కారణాలతో హైదరాబాద్‌కు వస్తున్న వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పారామౌంట్‌ హిల్‌ కాలనీలోని ఆఫ్రికన్లపై ప్రత్యేక కథనం.     

బంజారాహిల్స్‌ :ఇటీవల కాలంలో ఆఫ్రికన్లు హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం కోసం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మెడికల్‌ టూరిజంలో ముంబై, చెన్నై తర్వాత హైదరాబాద్‌ 3వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులకు హైదరాబాద్‌లో కొదవ లేదు. రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటం, హైదరాబాద్‌ నుంచి విమాన సేవలు మెండుగా ఉండటంతో ఆఫ్రికన్‌ దేశస్థులు చికిత్స కోసం హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. చాలా మంది ఆఫ్రికన్‌ యువత ఉన్నత విద్య కోసం నగరాన్ని ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్య, వైద్య సదుపాయాలు, తక్కువ ఖర్చుతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌ను బెస్ట్‌ ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో పారామౌంట్‌ హిల్‌ కాలనీ చిన్నపాటి ఆఫ్రికాలా మారింది. వీరు ఇక్కడ 30 ఏళ్లుగా నివసిస్తున్నారు.

అడుగడుగునా ఆఫ్రికన్‌ సంస్కృతి
సుడాన్, సోమాలియా, కాంగో, ఘనా తదితర దేశాల నుంచి వచ్చిన ఆఫ్రికన్లు ఏళ్ల తరబడి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో ఆఫ్రికన్‌ సంస్కృతీ సంప్రదాయాలు దర్శమిస్తుంటాయి. వారి జీవన విధానాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారాలు, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, అరేబియన్‌ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్రికన్‌ ఘుమఘుమలే కాకుండా దుస్తులకు సంబంధించిన వ్యాపారాలూ కనిపిస్తాయి. లాల్చీ లాంటి పొడవాటి రంగురంగుల దుస్తులు ధరించే వారు ఆకట్టుకుంటారు. ఇక జీన్స్, టీషర్టులతో సరికొత్త లుక్‌ ఇచ్చే యువత ప్రత్యేక ఆకర్షణ. మహిళలు ధరించే బూర్ఖాలు కూడా అందుబాటులో ఉంటాయి. తక్కువ మొత్తంలో అద్దెలు ఉండటంతో ఈ కాలనీని ఎంచుకుంటున్నారు. ఈ కాలనీలో ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన సుమారు వెయ్యి మంది వరకు విద్యార్థులు, మరో వెయ్యి మంది వరకు వివిధ కారణాలతోవచ్చిన వారు ఉన్నారు. కొంత మంది ఆఫ్రికన్ల పిల్లలు కూడా ఇక్కడి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఆదివారం వచ్చిందంటే ఇక్కడ సందడే సందడి.  

ఉస్మానియాలో బీటెక్‌ చేస్తున్నా..   
నేను మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్‌ చేస్తున్నాను. పారామౌంట్‌ కాలనీలో నా స్నేహితులతో కలిసి అద్దెఇంట్లో ఉంటున్నాం. హైదరాబాద్‌లో ఉంటే మా దేశంలో ఉన్నట్లుగానే ఉంది. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు బాగా నచ్చాయి.     – ఇసా సాల ఇసా, విద్యార్థి, ఆఫ్రికా

అందరితో కలిసిపోతాం..  
నేను ఇక్కడ నా స్నేహితులతో ఉంటున్నా. పారామౌంట్‌ కాలనీలో ఎటు చూసినా మా కల్చర్‌ కనిపిస్తుంది. ఇక్కడకు వచ్చే ప్రతి ఆఫ్రికన్‌ ఇదే కాలనీలో ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా మేమే కనిపిస్తాం. ఐకమత్యంతో ఉంటాం.    – జరత్‌ లూయిస్‌     రాబర్ట్,విద్యార్థి, కామెరూన్‌

మంచి వాతావరణం..  
కొన్నేళ్లుగా స్నేహితులతో కలిసి పారామౌంట్‌ కాలనీలో ఉంటున్నా. మిగతా దేశాల కంటే హైదరాబాద్‌లోనే తక్కువ ఖర్చుతో నివాసం ఉండటమే కాకుండా అన్ని సౌకర్యాలతో జీవించగలుగుతాం. చదువు కూడా మాకు ఉచితంగానే లభిస్తోంది.  – అబ్దుల్‌ రహీం,  విద్యార్థి, సూడాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement