50 ఏళ్ల తరువాత నోటీసులా? | After a 50-year-old notices? | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల తరువాత నోటీసులా?

Published Thu, Jan 15 2015 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

50 ఏళ్ల తరువాత నోటీసులా? - Sakshi

50 ఏళ్ల తరువాత నోటీసులా?

  • భూ రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలపై కొనుగోలుదారులకు నోటీసులా..
  • తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
  • న్యూఢిల్లీ: తప్పుడు పద్ధతుల ద్వారా లబ్ధిదారు పొందిన ఉత్తర్వులను సరిచేసే అధికారం ప్రభుత్వానికి కొంతకాలం వరకే ఉంటుందని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహేతుక కాలపరిమితిలోపే ఆ ఉత్తర్వులను సరిచేయాలని పేర్కొంది. దాదాపు యాభై ఏళ్ల క్రితం నాటి భూ రికార్డుల్లోని ఎంట్రీలు తప్పుడువని, వాటని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రంగారెడ్డి జిల్లాలోని గోపన్‌పల్లి గ్రామస్తులకు యాభై సంవత్సరాల తరువాత షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టింది.

    రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలు పడిన 50 ఏళ్ల తరువాత(2004లో) ఆంధ్రప్రదేశ్(తెలంగాణ ప్రాంతం) భూ రెవెన్యూ చట్టంలోని సవరణ అధికారాన్ని (రివిజన్ పవర్) ఉపయోగించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఎంతకాలం లోపు రివిజన్ పవర్ ఉపయోగించాలన్న విషయంలో స్పష్టత లేకున్నా.. ఇన్నాళ్ల తరువాత దాన్ని ఉపయోగించడం న్యాయపాలనకు విరుద్ధమని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.

    మానవ జీవితంలోని అన్ని చర్యలు, లావాదేవీలను ఏనాటికైనా సవాలు చేసే అవకాశం ఉండటం సమాజంలో అస్థిరతకు దారితీస్తుందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. న్యాయపాలన ప్రజాజీవితానికి అనుగుణంగా ఉండాలని తీర్పు రాసిన జస్టిస్ నాగప్పన్ సూచించారు. ఒక లావాదేవీ తప్పని తేలితే.. ఎప్పటికైనా దాన్ని సరిచేయొచ్చనే భావన సరికాదని, ఆ సందర్భాల్లో రివిజన్ పవర్‌ను ఉపయోగించడం కూడా తప్పే అవుతుందని జస్టిస్ ఠాకూర్ తేల్చి చెప్పారు. రివిజన్ పవర్‌తో జారీ చేసిన నోటీసులు న్యాయ విరుద్ధమని హైకోర్టు తీర్పివ్వడం సరైన చర్యేనన్నారు.
     
    విషయమేంటంటే: రంగారెడ్డి జిల్లా, గోపనపల్లి గ్రామంలో జాగిర్దార్ల ద్వారా తమకు సంక్రమించిన భూమిలో 90 ఎకరాలను పలువురు పట్టాదారులు అమ్మేశారు. అయితే, ఆ జాగిర్దారీ వ్యవస్థ అప్పటికే రద్దయినందున ఆ వ్యవస్థ ద్వారా సంక్రమించిన భూమిని ‘చిన్న కంచ’(పశువుల మేత కొరకు ఉపయోగించే భూమి)గా వర్గీకరించారని, అది ప్రభుత్వానికి చెందుతుందని, ఆ భూమిని అప్పటి పట్వారీ తప్పుగా రికార్డుల్లో చూపారని పేర్కొంటూ రివిజన్ పవర్ ద్వారా ఆ భూమిని కొన్నవారికి 2004లో ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గోపన్‌పల్లి గ్రామంలోని ఆ 90 ఎకరాలు సహా మొత్తం 477 ఎకరాలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ 1991లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement