బీసీల డిమాండ్లపై ఉద్యమం ఉధృతం
రేపటి నుంచి జిల్లాల్లో సమరభేరి మహాసభలు
హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలకు 50% రాజ కీయ రిజర్వేషన్లు, పది వేల కోట్లతో బీసీలకు సబ్ ప్లాన్, బీసీ మహిళలకు కల్యాణ లక్ష్మి వర్తింపజేయాలనే ప్రధాన డిమాండ్లతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 8 నుంచి వివిధ జిల్లాల్లో సమరభేరి మహాసభలను, 30న చలో అసెంబ్లీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ డిమాండ్లు - భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ అనే అం శంపై వివిధ బీసీ సంఘాలతో సమావేశం జరిగింది.
కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పార్టీలకతీ తంగా జరిగే ఈ ఉద్యమంలో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. 8న నిజామాబాద్‌లో, 11న మహబూబ్‌నగర్‌లో, 20న సంగారెడ్డి లో, 22న ఆదిలాబాద్‌లో, 30న హైదరాబాద్‌లో సమరభేరి సభల్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్. దుర్గయ్య గౌడ్, ఎం.అశోక్‌గౌడ్, బీసీ కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిరంజన్ పాల్గొన్నారు.