* నాబార్డ్ ప్రతిపాదన
* రబీ, టర్మ్ రుణాలూ ఖరారు
* జిల్లాల వారీగా కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల పెంపులో కీలక భూమిక పోషించే రుణ ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుత ఖరీఫ్ కాలానికి రూ.30,587.59 కోట్ల పంట రుణాలు ఇచ్చేలా ‘నాబార్డ్’ ప్రణాళికను ప్రతిపాదించింది. ఖరీఫ్‌తో పాటు రబీకి, వ్యవసాయానుబంధ రంగాలకు ఇచ్చే కాల పరిమితి (టర్మ్) రుణాలనూ ఖరారు చేసింది.
2015 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ శాఖ ప్రకటించిన వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రూ.69,548 కోట్లను బ్యాంకర్లు రైతులకు రుణాలుగా ఇస్తారు. ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడుతుంది. రుణ ప్రణాళిక అమలుకు సహకార సంస్థలు, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో పంట రుణాలుగా రూ.30,587.59 కోట్లు, రబీలో రూ.20,391.73 కోట్లు, వ్యవసాయానుబంధరంగాలు సహా కాల పరిమితి రుణాలుగా రూ.18,569.51 కోట్లు ఇవ్వాలని నాబార్డ్ ప్రతిపాదించింది. ఏయే జిల్లాలకు ఎంతెంత మొత్తంలో కేటాయించిందీ ప్రకటించింది.
ఈ ఏడాదికీ పావలా వడ్డీ..
చిన్న, సన్నకారు రైతులు రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల లోపు తీసుకునే రుణానికి పావలా వడ్డీ ఈ ఏడాది కూడా వర్తిస్తుంది. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. నిర్ణీత గడువులోపు చెల్లించే రైతులు 3 శాతం వడ్డీని చెల్లిస్తే మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.పది కోట్లను కేటాయించింది.
వడ్డీ లేని రుణాలకు.. : రూ.లక్షలోపు రుణం తీసుకునే కౌల్దారులు, సన్నకారు రైతులు.. రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే ఎటువంటి వడ్డీని బ్యాంకులు వసూలు చేయవు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.17.2 కోట్లను కేటాయించింది. ఈ పథకాలన్నింటికీ టీడీపీ ప్రభుత్వ రుణమాఫీ పెద్ద ఆటంకంగా నిలిచింది. కొత్తరుణాలు ఇవ్వలేమని, కనీసం పాతవాటిని పునరుద్ధరించుకోవడమైనా చేయాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా ఇంతవరకు కొత్త అప్పులు పుట్టకపోవడం రైతుల్ని తీవ్రంగా కుంగదీస్తోంది. దీంతో అనివార్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
రూ.30 వేల కోట్లతో రుణ ప్రణాళిక
Published Fri, Jun 26 2015 1:39 AM | Last Updated on Fri, Oct 19 2018 7:14 PM
Advertisement
Advertisement