రాష్ట్రంలోని ఒక జిల్లాలో కేంద్ర వ్యవసాయ బీమా పథకం అమలు
సాక్షి, హైదరాబాద్: ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం (యూపీఐఎస్)ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు పంపించింది. దేశవ్యాప్తంగా 45 జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. తెలంగాణలో ఒక జిల్లాను పెలైట్ ప్రాజెక్టుకు ఎంపిక చేస్తారు. ఏ జిల్లాను ఎంపిక చేయాలన్న అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.
రెండు మూడ్రోజుల్లో జిల్లాను ఎంపిక చేయనున్నారు. అలాగే కొన్ని ప్రైవేటు వ్యవసాయ బీమా కంపెనీలనూ ఖరారు చేసి వాటిని కూడా అమలులో భాగస్వామ్యం చేస్తారు. యూపీఐఎస్ పథకంలో మొత్తం ఏడు సెక్షన్లు ఉన్నాయి. వాటిలో మొదటిది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)ను తప్పక ఎంపిక చేసుకోవాలి. మిగిలిన ఆరు సెక్షన్లలో కనీసం ఏవైనా రెండింటిని రైతులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పంటలకు నష్టం వాటిల్లితే పీఎంఎఫ్‌బీవై పథకాన్ని వర్తింపజేస్తారు. మిగిలిన సెక్షన్లన్నీ రైతు ప్రమాదానికి గురైనా, అతని వ్యవసాయ యంత్రాలు, ఇతరత్రా నష్టం వాటిల్లినా వర్తింపజేస్తారు.