
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం భారీగా జరిగింది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో కురిసిన భారీ వర్షాలకు చేతికొస్తున్న పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయశాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం 1.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఫలితంగా 56 వేల మంది రైతులు నష్టపోయారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక సమర్పించింది. వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు నివేదికలో పేర్కొంది. మరో వారం, పది రోజుల్లో కోతకు వచ్చే వరి 80,447 ఎకరాల్లో వర్షాలకు నష్టపోయినట్లు నివేదించింది. కరీంనగర్ జిల్లాలో 25,595 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. రాష్ట్రవ్యాప్తంగా 35,610 ఎకరాల్లో పత్తి పంట వర్షాలకు నష్టపోయినట్లు పేర్కొంది. ఇప్పటికే పత్తి మొదటితీత కొనసాగుతోంది. ముందుగా వేసిన పత్తిని రైతులు తీస్తున్నారు. ప్రతిరోజూ వర్షాలు కురుస్తుండటం వల్ల పత్తి తడిచి నల్లబడిపోయింది. కాయలు కూడా మచ్చలు వచ్చి పూర్తిగా నల్లపడ్డాయి.
అలా రంగుమారిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. 4,022 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాల వారీగా చూస్తే సూర్యాపేటలో 29 వేల ఎకరాల్లో, కరీంనగర్‌లో 25 వేల ఎకరాల్లో, పెద్దపల్లి జిల్లాలో 8,354 ఎకరాల్లో, నిజామాబాద్‌లో 8,730 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మంచిర్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో మొత్తంగా 142 మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. నైరుతి ఒక నెల ఆలస్యంగా రావడంతో పాటు నెల ఆలస్యంగా వెనుతిరిగింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా కదలడంతో వారం, పది రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది.