- నేడు జెడ్పీ సర్వసభ్య ప్రత్యేక సమావేశం
- మంత్రులు పోచారం, ఈటెల హాజరు
కరీంనగర్: జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశం మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరగనుంది. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ హాజరవుతారు. జిల్లాలో వ్యవసాయ రంగ స్థితిగతులు, అనుబంధ విభాగాలు, బడ్జెట్ రూపకల్పనపై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చేపట్టిన పథకాలతో పాటు ఆయా మంత్రులకు సంబంధించిన శాఖలపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ సమావేశాల ద్వారా అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. సభ్యులకు అవగాహన కల్పించడం, ప్రజలకు తెలియచేయడం, సమావేశాల నుంచి నివేదికలు తీసుకోవడం లక్ష్యంగా ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆయా శాఖలు, పథకాల వారీగా జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశాలను సంబంధిత శాఖ మంత్రితో చేపడుతున్నారు.
ప్రస్తుత జెడ్పీ పాలకవర్గం కొలువు తీరాక సాధారణ సమావేశాలకన్నా ప్రత్యేక సమావేశాలే ఎక్కువగా నిర్వహిస్తుండడం విశేషం. ముందుగా సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించగా, ఆ తరువాత స్థాయీ సంఘం ఎన్నికల కోసం ఒకసారి, బీఆర్‌జీఎఫ్ పథకంపై రెండోసారి, మిషన కాకతీయపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆధ్వర్యంలో మూడోసారి సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా నాలుగో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.