సాక్షి, హైదరాబాద్: ఎయిడెడ్ విద్యా సంస్థలకు జవజీవాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల సంఖ్య, వాటిల్లో పరిస్థితులు, విద్యార్థులు, బోధన సిబ్బంది సంఖ్య, ఎంత మందిని నియమించాల్సి ఉంటుందనే అంశాలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలోని పాఠశాలలు, జూనియర్ , డిగ్రీ కాలేజీల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా కమిటీలను వేసింది. కమిటీల నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలోని కొన్ని ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలకు ఎకరాల కొద్దీ విలువైన భూములున్నాయి.
వాటిపై కన్నేసిన వారసులు, ఇతరులు ఆ సంస్థలను నిర్వీర్యం చేసి అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములను అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. అలాంటి భూముల కోసమే కొంతమంది న్యాయ వివాదాలను సృష్టించారు. వాటి పరిస్థితిని కూడా ప్రభుత్వం తేల్చేయనుంది. మరోవైపు ఎంతో పేరున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజీలు, వీవీ కాలేజ్, ఏవీ కాలేజ్, అంబేడ్కర్ కాలేజ్, వరంగల్‌లో ఎల్‌బీ కాలేజీ, సీకేఎం కాలేజీ, ఏవీవీ హైస్కూల్, జూనియర్ కాలేజ్, మహబూబియా పంజతన్ కాలేజీ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచి పేరున్న కాలేజీలతోపాటు విద్యార్థులు ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో అవసరమైన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
లక్షన్నర మంది పిల్లలకు 1,700 మందే టీచర్లు
రాష్ట్రంలో 850 వరకు ఎయిడెడ్ పాఠశాలలున్నా ప్రస్తుతం 778 స్కూళ్లు మాత్రమే కొనసాగుతున్నాయి. వాటిల్లో 6 వేల మంది టీచర్లు అవసరం కాగా కేవలం 1,700 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. వాటిల్లో 1.48 మంది పిల్లలు చదువుకుంటున్నారు. యాజమాన్యాలే కొంతమందిని తాత్కాలికంగా నియమించుకొని బోధనను కొనసాగిస్తున్నాయి. ఇక 42 జూనియర్ కాలేజీల్లో (ఇందులో 22 కాలేజీలో హైదరాబాద్‌లో ఉన్నాయి.) 4,500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాటిల్లో 1,200 మంది టీచర్లు అవసరం కాగా కేవలం 272 మంది మాత్రమే ఉన్నారు.
ఇక డిగ్రీ కాలేజీలు 63 ఉండగా (ఇందులో 50 హైదరాబాద్‌లోనే ఉన్నాయి) వాటిల్లో 18 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో 1,770 మంది లెక్చర ర్లు అవసరం కాగా కేవలం 325 మంది మాత్రమే ఉన్నారు. వీరు కాకుండా బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉంది. నియామకాల్లో యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు, న్యాయ వివాదాల నేపథ్యంలో 2006లో ప్రభుత్వం జీవో 35 ద్వారా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో నియామకాలపై నిషేధం విధించింది.
‘ఎయిడెడ్’కు జవజీవాలు!
Published Wed, Jan 13 2016 5:01 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
Advertisement
Advertisement