
సాక్షి, సిటీబ్యూరో: జనతా కర్ఫ్యూతో గ్రేటర్ సిటీజనులకు ఆదివారం స్వచ్ఛ ఊపిరి సాకారమైంది. నిత్యం రణగొణ ధ్వనులు..ట్రాఫిక్ రద్దీతో కిటకిటలాడే మహా నగర రహదారులు వాహనాల రాకపోకలు లేక బోసిపోయాయి. వాయు కాలుష్యం కనిష్ట స్థాయికి చేరింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ఘనపు మీటరు గాలిలో సూక్ష్మ, స్థూల ధూళి కణాల మోతాదు 60 మైక్రో గ్రాములు మించరాదు.
కానీ ఆదివారం ఆబిడ్స్, పంజాగుట్ట, ప్యారడైస్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,గచ్చిబౌలి, మాదాపూర్, ఎల్బీనగర్, మలక్‌పేట్, కూకట్‌పల్లి, ఉప్పల్ తదితర అత్యంత రద్దీ ప్రాంతాల్లో ధూళి కణాల మోతాదు 30 నుంచి 40 మైక్రో గ్రాముల మేర మాత్రమే నమోదవడం విశేషం. సాధారణ రోజుల్లో ఈ ప్రాంతాల్లో ధూళి కణాల మోతాదు 90 నుంచి 110 మైక్రోగ్రాముల మేర నమోదవుతుండడం గమనార్హం. నిత్యం ఆయా ప్రాంతాల్లో లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో మోటారు వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ తదితర కాలుష్య ఉద్గారాలు మోతాదు కూడా అనూహ్యంగా కనిష్ట స్థాయికి తగ్గడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఏడాదికి 183 రోజులపాటు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రాంతాలు... ఆదివారం స్వచ్ఛ గాలి సాకారమైందని పలువురు అభిప్రాయపడ్డారు.కాగా సంక్రాంతి, దసరా పర్వదినాల సందర్భంగా మెజార్టీ సిటీజన్లు పల్లెబాట పట్టిన సమయంలోనూ వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. కానీ ఆదివారం మరీ కనిష్ట స్థాయికి చేరుకోవడం ఓ రికార్డని పీసీబీ శాస్త్రవేత్తలు తెలపడం విశేషం. ఆదివారం ఆయా ప్రాంతాల్లో నమోదైన వాయు కాలుష్యం వివరాలను పీసీబీ నమోదు చేసింది..
సాధారణ రోజుల్లో కాలుష్యం ఇలా..
గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య 50 లక్షలు కాగా.. ఇందులో కాలం చెల్లిన వాహనాలు 15 లక్షల వరకు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న పొగ లో ఉండే పలు కాలుష్య ఉద్గారాలు సిటీజనుల ఊపిరితిత్తులు పొగచూరుతున్నాయి. వీటికి తోడు నగరానికి ఆనుకొని ఉన్న 500 వరకు ఉన్న బల్క్‌డ్రగ్,ఫార్మా,ఇంటర్మీడియట్ పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్య ఉద్గారాలతో నగర పర్యావరణంహననమౌతోంది.
Comments
Please login to add a commentAdd a comment